అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు నిబద్ధతతో పనిచేయాలని భారత్-నార్వే సోమవారం నిర్ణయించాయి. నార్వేలో మొదటి సారి పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి నార్వే మద్దతునిచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో తలెత్తిన ఘర్షణలను చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని, మిలటరీ చర్చల ద్వారా కాదని ఈ సందర్భంగా మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
వాణిజ్యం, ఇంధనం, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి చర్చలు జరిపేందుకు, ఇరు దేశాల మధ్య సంబంధాలకు మరింత వూతమివ్వడానికి ఈ పర్యటన ఉద్దేశించినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. నార్వే ప్రధాని జోనాస్ గర్ స్టోర్‌తో మోదీ సోమవారం చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య గల సంబంధాలను హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్ళాలని ఇరు దేశాలు ఆదివారం అంగీకరించాయి.
ఈ సందర్భంగా పునర్వినియోగ ఇంధనం, సమ్రుద జలాల ఆర్థిక వ్యవస్థ, సమ్రుద జలాల్లో భద్రత, వాతావరణ సహకారం వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టారు. ఇండో-పసిఫిక్ చొరవలో నార్వే కూడా చేరుతోందని అన్నారు. ఇరు దేశాలు కలిసి సముద్ర జల ఆర్థిక వ్యవస్థలను, భద్రతను, సామర్ధ్యాల పెంపును బలోపేతం చేసుకుంటామని చెప్పారు. అలాగే నార్వే రాజు కింగ్ హెరాల్డ్-5, రాణి సోంజాలతో కూడా మోదీ భేటీ అయ్యారు.
కాగా, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాల్ళను అధిగమించాంటే అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తీసుకురావడం అత్యంత అవశ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ, ఏ సమస్యకైనా పరిష్కారం మిలటరీ ఘర్షణల్లో దొరకదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో శాంతి దిశగా వేసే ప్రతి అడుగుకు తమ మద్దతు వుంటుందని చెప్పారు. వాణిజ్యానికి సంబంధించి భారత్, యూరప్‌లు స్వర్ణ శకంలోకి ప్రవేశిస్తున్నాయని పేర్కొంటూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలే ఇందుకు కారణమని తెలిపారు.
మోదీకి నార్వే అత్యున్నత పౌర పురస్కారం
నార్వే అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ రాయల్ నార్వేయిన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ను ప్రధాని మోదీ అందుకున్నారు. మొదటిసారి తమ దేశానికి వచ్చిన భారత ప్రధాని మోదీని సోమవారం నార్వే కింగ్ హెరాల్డ్-5 దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించారు. నార్వే, మానవాళి శ్రేయస్సు కోసం విశిష్ట సేవలు అందించిన విదేశీయులు, నార్వే పౌరులకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రధాని మోదీకి ఇది 32వ అంతర్జాతీయ పురస్కారం.

More Stories
ట్రంప్ పోస్ట్ లో అమెరికా జెండా ఉన్న గల్ఫ్ పటం, పేలుడు చిత్రాలు
డొనాల్డ్ ట్రంప్ చుట్టూ సరికొత్త అవినీతి వివాదం
యూఏఈలో అణువిద్యుత్ కేంద్రంపై దాడి.. ఖండించిన భారత్