సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను పెంచుతూ ఆర్డినెన్స్‌

సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను పెంచుతూ ఆర్డినెన్స్‌
భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)ని కలుపుకొని సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 38కి పెరగనుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం నాడు ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరగనందున, తక్షణ చర్యలు తీసుకోవలసిన పరిస్థితుల్లో రాష్ట్రపతి ఈ ఆర్డినెన్స్‌ ‌జారీ చేసినట్లు గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 
 
సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ ఆర్డినెన్స్-2026 అని పిలుస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతికి ఉన్న అధికారాలకు అనుగుణంగా ఈ ఆర్డినెన్సు జారీ చేశారు. పార్లమెంటు సమావేశమైనప్పుడు ఈ ఆర్డినెన్సును ఉభయ సభలలో ప్రవేశపెడతారు.  పార్లమెంటు తిరిగి సమావేశమైన తర్వాత ఆరు వారాలు గడిచినా దానిపై ఎలాంటి తీర్మానాన్ని ఆమోదించక పోయినా లేదా పార్లమెంటు ఉభయ సభలలో ఈ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ తీర్మానాలు ఆమోదం పొందినా, ఇది అమలులో ఉండదు. రాష్ట్రపతి ఎప్పుడైనా ఈ ఆర్డినెన్సును ఉపసంహరించుకోవచ్చు. 
 
ప్రస్తుత ఆర్డినెన్స్-1956 నాటి సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) చట్టంలోని సెక్షన్ 2ను సవరించి, భారత ప్రధానన్యాయమూర్తిని మినహాయించి న్యాయమూర్తుల సంఖ్య ‘ముప్పై మూడు’ అనే పదాన్ని ‘ముప్పై ఏడు’గా మార్పు చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఈ నెల 5న ఆమోదం తెలిపింది.
ఈ ఆర్డినెన్స్ అమలులోకి రావడంతో భారత ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీంకోర్టులో మంజూరైన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34 నుండి 38కి పెరుగుతుంది. 
ఆరేళ్ల విరామం తరువాత సుప్రీంకోర్టులో అదనపు న్యాయమూర్తుల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి, మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 31 నుంచి 33కు పెంచుతూ 2019లో పార్లమెంటు సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) చట్టం, 1956లోని సెక్షన్ 2ను చివరిసారిగా సవరించింది. 
ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల పదవుల్లో రెండు ఖాళీగా ఉన్నాయి. 2026లో మరో ముగ్గురు సుప్రీం న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు.
జస్టిస్ జె.కె. మహేశ్వరి, పంకజ్ మిథాల్ వచ్చే జూన్‌లో తమ పదవీకాలాన్ని ముగించనుండగా, జస్టిస్ సంజయ్ కరోల్ ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు.  న్యాయమూర్తుల సంఖ్య పెంపుపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వికాస్ సింగ్ మాట్లాడుతూ ఈ డిమాండ్ ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉందని, ఇప్పటికైనా ఈ సంఖ్య పెంచడం మంచిదని తెలిపారు.
అలాగే, కేసుల పరిష్కారానికి వీలుగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సుప్రీంకోర్టులో నిర్మాణం చేపడుతున్న కొత్త భవన సముదాయం ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త భవన సముదాయం 38 మంది జడ్జీలు విధులు నిర్వర్తించేందుకు సరిపోతుందని తెలిపారు.