ఈసారి తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గత ఏడాదితో పోలిస్తే రుతుపవనాల రాక 4 నుంచి 5 రోజులు ఆలస్యం కానుంది. ఈ నెల 26న కేరళను తాకనున్న రుతుపవనాలు, ఆ తర్వాత సాధారణంగా 4 నుంచి 7 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు , బంగాళాఖాతం, అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. ఇవి మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలావుంటే రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
అధిక ఎండ తీవ్రతతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిపాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 16 జిల్లాల్లో 41 నుంచి 44 మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
కాగా, నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులను తాకినట్లు తాకినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. నైరుతి రుతుపవనాలు ముందుగా అంచనా వేసినట్లుగానే ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, నికోబార్ దీవులతో పాటు అండమాన్ రాజధాని శ్రీ విజయ పుర వరకు విస్తరించాయని ఐఎండి శనివారం వెల్లడించింది. రాబోయే మూడు-నాలుగు రోజుల్లో, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, అలాగే నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. రుతుపవనాలు ముందుకు సాగడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.

More Stories
చర్లపల్లి – తిరుచానూరు (తిరుపతి) మధ్య కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు
ఎస్ఐఆర్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయి
హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవీదేవిపై దుష్ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు