పోక్సో కేసులో నిందితుడైన కేంద్రమంత్రి తనయుడు బండి భగీరథ్‌ను శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మేడ్చల్ కోర్టు న్యాయమూర్తి అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో రాత్రి 12 గంటల సమయంలో అతనిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ నెల 8వ తేదీన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన తర్వాత ముందస్తు బెయిలు, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ అతను హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఎలాంటి ఉపశమనం లభించలేదు.
శనివారం ఉదయం పోలీసులు భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతడిని పట్టుకోవడానికి 5 స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తన కుమారుడిని తానే పోలీసులకు అప్పగించినట్లు రాత్రి 8 గంటల సమయంలో బండి సంజయ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భగీరథ్‌ను అరెస్టు చేశామంటూ సైబరాబాద్ పోలీసులు తెలిపారు. పోలీస్ అకాడమీ(అప్పా జంక్షన్) సమీపంలో అదుపులోకి తీసుకుని నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు.
భగీరథ్‌ను స్టేషన్ తీసుకెళ్లగానే కేసు పర్యవేక్షణాధికారిణి, ఈ కేసులో సిట్ అధికారి డీసీపీ రితిరాజ్ అక్కడికి చేరుకొని, విచారించి, అతడిని కోర్టుకు తరలించేందుకు వేగంగా ఏర్పాట్లు చేశారు. రాత్రి 8 గంటల సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ చట్టాన్ని గౌరవిస్తూ తన కుమారుడిని తానే స్వయంగా పోలీసులకు అప్పగియించినట్లు ప్రకటించారు.
“మా అబ్బాయి బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపైనున్న గౌరవంతో ఈరోజు అడ్వోకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించాను. నేను ఇంతకు ముందే చెప్పిన. చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే” అని తెలిపారు. “మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే ఆయనను స్టేషన్ లో అప్పగిద్దామనుకున్నా. లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాడు. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది” అని వివరించారు.
“సోమవారం నాడు కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావొద్దనే ఉద్దేశంతో మా అబ్బాయిని విచారణకు పంపించాను” అని చెప్పారు. అంతకుముందు శనివారం ఉదయం బిఎన్ఎస్ సెక్షన్ 183 ప్రకారం జడ్జి సమక్షంలో బాధితురాలైన మైనర్ బాలికతో పాటు ఆమె తల్లి స్టేట్మెంట్ రికార్డు చేయించారు. ఈ వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేసి భద్రపరిచారు.

More Stories
హామీల అమలు లేకుండా పగటి కలలు కంటున్నా రేవంత్!
జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం కోసం బీజేపీ పోరాటంలో ఉద్రిక్తత
ఈనెల 21 నుండి జూన్ 1 వరకు సరస్వతీ నదీ అంత్య పుష్కరాలు