బీజేపీ ఎన్నికల విజయాలపై అమెరికాలో సంబరాలు 

బీజేపీ ఎన్నికల విజయాలపై అమెరికాలో సంబరాలు 
భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకొని, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ ఆధ్వర్యంలో  న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో ఉన్న రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో ఘన విజయోత్సవ సభ నిర్వహించారు.కార్యక్రమానికి ట్రై-స్టేట్ ప్రాంతం నుండి 600 మందికి పైగా భారతీయ అమెరికన్లు హాజరయ్యారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తొలిసారి సాధించిన చారిత్రాత్మక విజయంతో పాటు, అసోంలో వరుసగా మూడోసారి, పుదుచ్చేరిలో రెండోసారి ఎన్డీయే ప్రభుత్వాలు  ఏర్పడటం పట్ల సభలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ప్రతి ఫలితాన్ని సభికులు ఘన చప్పట్లతో స్వాగతించారు.  భారత పార్లమెంట్ సభ్యులు మయాంక్ నాయక్  జూమ్ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల నాయకత్వంలో బీజేపీ ఎన్నో సంవత్సరాల పాటు కృషి చేసి ఈ విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. 

ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ అధ్యక్షులు డా. అడపా ప్రసాద్ మాట్లాడుతూ, “భారత భద్రత మరియు సమగ్రత దృష్ట్యా బెంగాల్, అసోం విజయాలు ఎంతో కీలకం” అని తెలిపారు. భారతీయ జనసంఘ స్థాపకుడు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ 75వ వార్షికోత్సవ సంవత్సరంలో బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. అలాగే కేరళలో కూడా బీజేపీ ఓట్ల శాతం మరియు స్థానాల్లో మంచి పురోగతి సాధించిందని చెబుతూ వచ్చే ఎన్నికల్లో అక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ ప్రధాన కార్యదర్శి వాసుదేవ్ పటేల్ మాట్లాడుతూ, “ఇది ఎంతో మధురమైన విజయం. అనేక సంవత్సరాలుగా బీజేపీ కార్యకర్తలు నేలస్థాయిలో చేసిన కఠోర శ్రమకు భారత ప్రజలు ఇచ్చిన గౌరవం ఇది” అని తెలిపారు.  ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ  తెలంగాణ చాప్టర్ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ తెలంగాణ లో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని, డబల్ ఇంజిన్ సర్కారు రావాలని కోరుతూ, దీని కోసం ప్రధాని మోదీ సభ  హైదరాబాద్ లో విజయవంతముగా జరగడం పట్ల అభినందనలు తెలిపారు.

సభలో పలువురు వక్తలు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా,  బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ లనాయకత్వాన్ని ప్రశంసించారు. పార్టీ బలోపేతానికి వారి వ్యూహాత్మక నాయకత్వం, క్షేత్రస్థాయి నిర్వహణ ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.

ప్రముఖ కమ్యూనిటీ నాయకులు కృష్ణారెడ్డి అనుగుల, జయేష్ పటేల్, చరణ్ సింగ్, ఆల్బర్ట్ జసాని,  హెచ్.ఆర్. షా, డా. సుధీర్ పారిఖ్,  పీయూష్ పటేల్, శ్రీమతి కల్పనా శుక్లా, శ్రీమతి దీప్తి జాని, ప్రదీప్ కట్ట,  శ్రీమతి సుమా రెడ్డి, విలాస్ జంబుల,అరవింద్ పటేల్, అమిత్ పాండే, ఆనంద్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన విందులో  పశ్చిమ బెంగాల్ విజయాన్ని పురస్కరించుకొని బెంగాలీ ప్రత్యేక వంటకం “జాల్‌మురి”ని వడ్డించారు.