నీట్ యూజీ పరీక్షను వచ్చే ఏడాది నుంచి కంప్యూటర ఆధారిత పరీక్షగా నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నీట్ రీ ఎగ్జామ్‌కు చెందిన అడ్మిట్ కార్డులు జూన్ 14వ తేదీ వరకు పంనున్నట్లు చెప్పారు. మే 3వ తేదీన జరిగిన పరీక్షను రద్దు చేసిన నేపథ్యంలో మళ్లీ జూన్ 21వ తేదీన పరీక్షను నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఓ గెస్ పేపర్ వాట్సాప్‌లో వైరల్ కావడం, దాంట్లో ఉన్న వంద ప్రశ్నల వరకు రిపీట్ కావడం వల్ల కేంద్రం నీట్ పరీక్షను రద్దు చేసింది. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం జీరో టాలరెన్స్‌తో ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితులను ఎదురుకావడం వల్లే రాధాకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల సవాళ్లు అధికం అయ్యాయని, అయినా విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి నష్టం జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు.
“ప్రశ్నపత్రం లీక్ వార్తలు రాగానే విచారణకు ఆదేశాలు జారీచేశాం. విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు ఎవరూ నష్టపోకూడదనే పరీక్ష రద్దుచేసి మళ్లీ నిర్వహిస్తున్నాం. పరీక్ష పారదర్శకంగా నిర్వహించడమే మా ప్రధాన కర్తవ్యం. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనేది మా మొదటి ప్రాధాన్యం” అని కేంద్ర మంత్రి తెలిపారు.
“పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించబోము. పేపర్ ఎలా లీక్ అయింది? ఎవరి నుంచి ఎక్కడికి వెళ్లిందనేది పూర్తి వివరాలు బహిర్గతమవుతాయి. సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని భరోసా ఇచ్చారు. అంతకుముందు నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహించడానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
గురువారం రాత్రి జరిగిన ఈ సమావేశంలో నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై కూలంకషంగా చర్చలు జరిపినట్లు పేర్కొన్నాయి. ఈ సమావేశానికి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, సీబీఎస్ఈ ఛైర్పర్సన్ రాహుల్ సింగ్, కేంద్రీయ విద్యాలయ సంఘఠన్, నవోదయ విద్యాలయ సమితి కమిషనర్లు, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.

More Stories
భోజ్‌శాల కాంప్లెక్స్ హిందువులదే
సంక్షోభాల నివారణలో స్థిరత్వాన్ని అందించే బ్రిక్స్ కూటమి
రాహుల్ గాంధీ ఆదాయం, విదేశీ పర్యటనల ఖర్చుల్లో వ్యత్యాసం