ఇరాన్‌కు అణ్వస్త్రం ఉండొద్దు.. హర్మూజ్ తెరిచే ఉండాలి

ఇరాన్‌కు అణ్వస్త్రం ఉండొద్దు.. హర్మూజ్ తెరిచే ఉండాలి

* అమెరికా, చైనా ఒకే మాట…  తైవాన్‌  విషయంలో ఎవ్వరి దారి వారిదే!

ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుధం ఉండకూడదనే అంశంపై అమెరికా, చైనా ఏకాభిప్రాయానికి వచ్చాయి. గురువారం చైనా రాజధాని బీజింగ్‌లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ భేటీలో ఈమేరకు ఇరుదేశాలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. ప్రపంచ దేశాలకు ఇంధన వనరుల సప్లై నిరాటంకంగా జరిగేందుకు హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.

హర్మూజ్ జలసంధి మార్గంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, మరింత అమెరికన్ చమురును కొనేందుకు జిన్‌పింగ్ ఆసక్తిని కనబర్చారు. అయితే హర్మూజ్ జలసంధి సైనికీకరణను, దాని వినియోగానికి సుంకాన్ని విధించే ఏ ప్రయత్నాన్నైనా వ్యతిరేకిస్తామని ట్రంప్‌కు ఆయన స్పష్టం చేశారు.  అమెరికన్ వ్యాపారాలకు చైనాలో మార్కెట్ అవకాశాలను విస్తరించడం సహా ఆర్థిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపైనా వీరిద్దరు చర్చించారు. 

“చైనా-అమెరికా సంబంధాలలో తైవాన్ సమస్య అత్యంత ముఖ్యమైన అంశం. దీన్ని సరిగ్గా పరిష్కరిస్తే ద్వైపాక్షిక సంబంధాలు సంపూర్ణ స్థిరత్వాన్ని పొందుతాయి. లేకపోతే అమెరికా, చైనా మధ్య ఘర్షణలు, సంఘర్షణలు తలెత్తి, మొత్తం సంబంధాలు తీవ్ర ప్రమాదంలో పడతాయి” అని ట్రంప్‌తో కలిసి బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ వేదికగా చేసిన ప్రసంగంలో జిన్‌పింగ్ హెచ్చరించారు. 

తైవాన్‌కు అమెరికా ప్రకటించిన భారీ ఆయుధ ప్యాకేజీ నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, అమెరికా పరస్పరం ఘర్షణ కాకుండా సహకారం దిశగా సాగాలని ఆయన హితవు పలికారు.  చైనా-అమెరికా సంబంధాల భవిష్యత్తుపై కూడా జిన్‌పింగ్‌ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. 
 
“రెండు అగ్రరాజ్యాలు ‘థుసిడైడ్స్​ ట్రాప్​’ను అధిగమించి కొత్త తరహా సంబంధాలను నిర్మించగలవా? ప్రపంచ సవాళ్లను కలిసి ఎదుర్కొని ప్రపంచానికి మరింత స్థిరత్వం అందించగలమా? మన రెండు దేశాల ప్రజల సంక్షేమం, మానవజాతి భవిష్యత్తు కోసం కలిసి మెరుగైన భవిష్యత్తును నిర్మించగలమా? ఇవి చరిత్రకు, ప్రపంచానికి, ప్రజలకు అత్యంత కీలకమైన ప్రశ్నలు. ప్రధాన దేశాల నాయకులుగా మీరు, నేను సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఇవే” అని జిన్​పింగ్ పేర్కొన్నారు. 
 
జిన్‌పింగ్‌ ప్రస్తావించిన ‘థుసిడైడ్స్’ అనే పదాన్ని తొలిసారిగా హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ పండితుడు గ్రాహమ్‌ టి. అలిసన్‌ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఎదుగుతున్న శక్తి ఒక అగ్రరాజ్య ఆధిపత్యాన్ని సవాలు చేసినప్పుడు ఏర్పడే తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ ప్రమాదాన్ని ఇది సూచిస్తుంది. 2026ను రెండు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే చారిత్రాత్మక సంవత్సరంగా మార్చేందుకు కలిసి పనిచేద్దాం అని జిన్‌పింగ్ పిలుపిచ్చారు.