కెన‌డా దౌత్యాధికారికి స‌మ‌న్లు

కెన‌డా దౌత్యాధికారికి స‌మ‌న్లు
భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలనీ, అలాకాని పక్షంలో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో తీవ్ర ప్రభావాన్ని చవిచూడాల్సి ఉంటుందని భారత్ కెనడా ప్రభుత్వాన్ని తీవ్రంగా  హెచ్చరించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఇవాళ కెనడా హైకమిషనర్‌కు సమన్లు జారీచేసింది.  
 
కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఢిల్లీలో పంజాబ్ రైతులు చేప‌డుతున్న‌ నిర‌స‌న‌ల‌పై కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో ఇటీవ‌ల ఆందోళ‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.  ఈ అంశాన్ని సీరియ‌స్‌గా భారత్ సీరియస్ గా తీసుకొంది. 
 
కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడోతో పాటు ఆ దేశ ఎంపీలు రైతుల ఆందోళ‌న ప‌ట్ల కామెంట్ చేయ‌డం స‌రైందికాద‌ని భారత్  హెచ్చ‌రించింది.  కెన‌డా నేత‌ల వ్యాఖ్య‌ల‌తో రెండు దేశాల మ‌ధ్య బంధాలు బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు భార‌త్ త‌న నిర‌స‌న‌లో పేర్కొన్న‌ది. 
 
భార‌త అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోవ‌డం ఆమోద‌యోగ్యం కాదు అని భార‌త్ ఆరోపించింది. ఇలాంటి చ‌ర్య‌లు ఇక ముందు కొన‌సాగితే, అప్పుడు రెండు దేశాల బంధాలపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని భార‌త విదేశాంగశాఖ వెల్ల‌డించింది. మీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల వ‌ల్ల కెన‌డాలో ఉన్న భార‌త హై క‌మిష‌న్‌, కాన్సులేట్ల ముందు తీవ్ర‌వాద కార్య‌క్ర‌మాలు పెరిగినట్లు భార‌త్ ఆరోపించింది. ఇది భ‌ద్ర‌తాప‌ర‌మైన స‌మ‌స్య‌గా మారుతోంద‌ని భార‌త్ త‌న హెచ్చ‌రిక‌లో పేర్కొన్న‌ది.