తెలుగు రాష్ట్రాలకు తాగునీటికి కృష్ణా జలాలు విడుదల

తెలుగు రాష్ట్రాలకు తాగునీటికి కృష్ణా జలాలు విడుదల

తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ కు 10 టీఎంసీల, తెలంగాణకు 21 టీఎంసీల విడుదలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతించింది. హైదరాబాద్ జలసౌధ వేదికగా జరిగిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం మే నెలాఖరు వరకు సాగర్ కుడి కాల్వ నుంచి 10 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ ఇప్పటికే బోర్డును కోరింది. 

జూలై నెలాఖరు వరకు శ్రీశైలం నుంచి 5, సాగర్ నుంచి 13 టీఎంసీల నీరు ఇవ్వాలని తెలంగాణ కోరింది. రెండు రాష్ట్రాల అవసరాలపై కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజు, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు రమేష్ బాబు, నర్సింహమూర్తి చర్చించారు. ఏపీ ఇప్పటికే కోటాకు మించి నీటిని వాడుకొందని, మళ్లీ ఇస్తే తమకు నష్టం జరుగుతుందని తెలంగాణ ఈఎన్సీ తెలిపింది. 

అయితే తాగునీటి అవసరాల కోసం నీటిని అడుగుతున్నట్లు ఏపీ ఈఎన్సీ తెలిపారు. మిగతా అంశాలు కాకుండా అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి కోసం వినియోగించుకునేలా నిర్ణయం తీసుకుందామని బోర్డు సభ్య కార్యదర్శి తెలిపారు. దీంతో ఏపీ విజ్ఞప్తి మేరకు ఆగస్టు నెలాఖరు వరకు సాగర్ కుడి కాల్వ నుంచి పది టీఎంసీలు ఇచ్చేందుకు అనుమతించారు.

ఏపీకి పది టీఎంసీలుపోగా రెండు ఉమ్మడి జలాశయాల్లో మిగిలిన మొత్తం నీరు తమకే చెందుతుందని, మళ్లీ ఇవ్వరాదని తెలంగాణ ఈఎన్సీ తెలిపారు. శ్రీశైలంలో 5 టీఎంసీలకుపైగా, నాగార్జునసాగర్లో దాదాపు 16 టీఎంసీల వరకు తెలంగాణ వినియోగానికి త్రిసభ్య కమిటీ అనుమతించింది. అటు గురువారం బోర్డు పూర్తి స్థాయి సమావేశం జరగనుంది. ఆ సమయంలో నీటి వాటాలు సహా అన్ని అంశాలపై చర్చ జరగనుంది.  

త్రిసభ్య కమిటీ సమావేశం సాఫీగా సాగిందని ఏపీ ఈఎన్‌సీ నరసింహమూర్తి తెలిపారు. ఆగస్టు 15 వరకు ఏపీ నీటి అవసరాల కోసం 10 టీఎంసీలు, తెలంగాణకు శ్రీశైలం నుంచి 5, సాగర్ నుంచి 16 టీఎంసీలు వినియోగించుకోవచ్చని ఏపీ ఈఎన్‌సీ ప్రకటించింది. ఈ నెల 14న జరిగే బోర్డు సమావేశంలో మిగిలిన అంశాలపై చర్చిస్తామని పేర్కొంది.