పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్యెల్యేల్లో తిరుగుబాటు  

పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్యెల్యేల్లో తిరుగుబాటు  
తమిళనాడులో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) మరో చీలిక ముప్పును ఎదుర్కొంటోంది. పార్టీ ఎమ్మెల్యేలలో అత్యధికులు, తమ మద్దతుదారుల మధ్య `ఈపీఎస్’ సుపరిచితులైన మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి నాయకత్వాన్ని ప్రశ్నించడమే ఇందుకు కారణం.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పళనిస్వామికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ తిరుగుబాటుకు మాజీ మంత్రి ఎస్.పి. వేలుమణి నాయకత్వం వహిస్తున్నారు. కొత్త నాయకత్వానికి మార్గం సుగమం చేసేందుకు పళనిస్వామి తన పదవి నుంచి వైదొలగాలని ఈ వర్గం డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా, సి.వి. షణ్ముగాన్ని పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా గుర్తించాలని కోరుతూ వారు ప్రొటెం స్పీకర్ ఎం.వి. కరుప్పయ్యకు ఒక లేఖను కూడా సమర్పించారు.
 
సోమవారం కొత్త అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున పార్టీ ఎమ్మెల్యేలు వేర్వేరు వర్గాలుగా విడిపోయి సభకు హాజరయ్యారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలలో ఒక పెద్ద వర్గం షణ్ముగం వెనుక నిలబడగా, ఒక చిన్న వర్గం మాత్రం ఈపీఎస్తోనే కొనసాగుతోంది. పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఈపీఎస్‌ను ఏఐఏడీఎంకే శాసనసభాపక్ష నాయకుడిగా సమర్థిస్తూ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ సమర్పించగా, షణ్ముగం వర్గానికి చెందిన సుమారు 30 మంది ఎమ్మెల్యేలు వేలుమణిని తమ ఫ్లోర్ లీడర్‌గా కోరుతూ అదే విధంగా లేఖ రాశారు.
తమిళనాడులో  రెండు ద్రావిడ పార్టీలు- డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య పొత్తు కుదిరే అవకాశంపై జరిగిన రహస్య చర్చలు విఫలమైన కొద్ది రోజులకే అన్నాడీఎంకే ఇప్పుడు ఒక చారిత్రాత్మక చీలిక దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నాయకులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో ఒక పెద్ద వర్గం, ఎడప్పాడి కె. పళనిస్వామి నాయకత్వాన్ని బహిరంగంగా సవాలు చేస్తూ, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే)తో పొత్తు పెట్టుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు.

జె. జయలలిత మరణానంతరం వరుస ఎన్నికల పరాజయాల నేపథ్యంలో పార్టీలోని శక్తివంతమైన నాయకులు ఈపీఎస్  రాజకీయ భవిష్యత్తును ప్రశ్నిస్తూ, పార్టీని వర్ధమాన రాజకీయ సమీకరణాల నుండి ఆయన ఒంటరి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ సంక్షోభానికి కేంద్ర బిందువుగా ఉన్న ప్రశ్న ఏమిటంటే, విజయ్ కొత్తగా ఏర్పాటు చేసిన టీవీకే  ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా? వద్దా? అనేది. ఎన్నికల అనంతర తీవ్ర చర్చలు, మిత్రపక్షాల మద్దతుతో శనివారం నాడు టీవీకే ప్రభుత్వం మెజారిటీ మార్కును దాటింది. 

 
అన్నాడీఎంకేలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కనీసం 30 మంది ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ నాయకులు ఇప్పుడు మాజీ మంత్రులు ఎస్.పి. వేలుమణి, సి. విజయభాస్కర్ తదితరులు  సీనియర్ నాయకుడు సి.వి. షణ్ముగం నేతృత్వంలోని తిరుగుబాటు వర్గంతో చేతులు కలిపారు. పార్టీ అధికారికంగా టీవీకేకి మద్దతు తెలిపి, ప్రభుత్వంలో చేరాలని ఈ వర్గం గట్టిగా కోరుతోంది. అయితే, ఈపీఎస్  మాత్రం అలా చేయడానికి సుముఖత చూపడం లేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ  47 స్థానాలను గెలుచుకుంది. ఈ సంఖ్యల కారణంగా పార్టీలో ఈపీఎస్ రాజకీయంగా ఇప్పటికే బలహీనపడ్డారని తిరుగుబాటు వర్గంలోని వర్గాలు పేర్కొన్నాయి. వారం రోజుల్లోపే తాము టీవీకేతో పొత్తు పెట్టుకోగలమని ఈ వర్గంలోని పలువురు నాయకులు విశ్వసిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

గత వారం డీఎంకే-ఏఐఏడీఎంకే మధ్య జరిగినట్లు ఆరోపిస్తున అధికార పంపకం చర్చలు విఫలమవ్వడమే ఈ ఉద్రిక్తతలకు తక్షణ కారణంగా నిలిచింది.  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రతిపాదిత ఏర్పాటులో డీఎంకే, ఏఐఏడీఎంకే కూటములలోని చిన్న మిత్రపక్షాలన్నింటి మద్దతుతో ఏఐఏడీఎంకే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం, డీఎంకే బయటి మద్దతుతో ఈపీఎస్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం వంటివి ఉన్నాయి. కానీ నాయకత్వం, అధికార పంపకం సూత్రాలపై విభేదాల కారణంగా ఈ ప్రణాళిక విఫలమైనట్లు సమాచారం.

ఈ ఆలోచనను పరిశీలించిన విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) నాయకుడు తోల్ తిరుమావళవన్, ఈపీఎస్ ముఖ్యమంత్రి కావడాన్ని వ్యతిరేకించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. చర్చల్లో తిరుమావళవన్ పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు, ఈపీఎస్ ఆ ప్రతిపాదనను అంగీకరించడానికి విముఖత చూపారు. ఆ ఆలోచన విఫలమవడంతో, వీసీకే మద్దతు హామీకి తోడు శనివారం టీవీకే మెజారిటీ మద్దతు ప్రదర్శించడంతో, ఏఐఏడీఎంకేలోని పాత భేదాభిప్రాయాలు వేగంగా మళ్లీ తలెత్తాయి.

పట్టును పటిష్టం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈపీఎస్ ఆదివారం జిల్లా కార్యదర్శులతో సమావేశమయ్యారని పార్టీ అంతర్గత వర్గాలు తెలిపాయి. కానీ అక్కడ కూడా ఆయనకు ఆందోళనకర సంకేతాలు వెలువడ్డాయి. సగానికి పైగా జిల్లా కార్యదర్శులు, ఈపీఎస్‌కు అత్యంత సన్నిహిత సంస్థాగత, ఆర్థిక స్తంభాలలో ఒకరిగా దీర్ఘకాలంగా పరిగణించబడుతున్న, కోయంబత్తూరుకు చెందిన ప్రభావశీల నాయకుడు వేలుమణి వైపు మొగ్గు చూపుతున్నారని భావిస్తున్నారు.

“ఈపీఎస్ చుట్టూ ఉన్నవారిలో ఎంతమంది నిజంగా ఆయనకు విధేయులుగా ఉన్నారు అనే దానిపై ఇప్పుడు పార్టీలో తీవ్రమైన ప్రశ్న తలెత్తుతోంది,” అని ఒక మాజీ ఏఐఏడీఎంకే మంత్రి చెప్పారు. తిరుగుబాటు వర్గం ఈపీఎస్ ముందు రెండు డిమాండ్లను ఉంచినట్లు సమాచారం: ఆయన ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వైదొలగాలి, అలాగే టీవీకేతో రాజకీయంగా చర్చలు జరిపేందుకు పార్టీకి అవకాశం ఇవ్వాలి.

విచిత్రంగా, వారసత్వం విషయంలో అసమ్మతి వర్గంలోనే ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఈపీఎస్‌ను తొలగిస్తే, చివరికి వేలుమణి లేదా షణ్ముగంలలో ఎవరు పార్టీ పగ్గాలు చేపట్టాలనే దానిపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని వర్గాలు తెలిపాయి. ఈ తిరుగుబాటు నాయకత్వం నిజమైన పునరుద్ధరణకు ప్రతీకనా లేక కేవలం ప్రస్తుత అధికార నిర్మాణాల పునర్వ్యవస్థీకరణ మాత్రమేనా అనే దానిపై ఏఐఏడీఎంకే కార్యకర్తలలో కూడా సందేహాలు కొనసాగుతున్నాయి.
 
మంత్రిపదవులు కేటాయింపులపై చర్చలు ఇప్పటికే అనధికారికంగా జరుగుతున్నాయని టీవీకే వర్గాలు తెలిపాయి. వారి సమాచారం ప్రకారం, వీసీకేకి ఒకటి లేదా రెండు మంత్రి పదవులు, కాంగ్రెస్‌కు రెండు పదవులు దక్కవచ్చు. ఇక అన్నాడీఎంకే విషయానికొస్తే, కూటమిలో అంతిమంగా చేరే ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఆ పార్టీకి ఎనిమిది నుండి పన్నెండు మంత్రిత్వ శాఖల మధ్య లభించే అవకాశం ఉంది.