పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఆసియా దేశాలు తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. తొలి దశ చర్యలన్నీ నిండుకోవడంతో, రెండో విడత ఆర్థిక దెబ్బ మొదలైంది. యుద్ధం మొదలైనప్పుడు హర్మూజ్ జలసంధి మూతపడడంతో ఆసియాకు చమురు సరఫరా ఒక్కసారిగా నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వాలు అత్యవసర చర్యలు చేపట్టాయి.
విద్యుత్ ఆదా కోసం వ్యాపారాలను మందగింప చేశాయి, గృహావసరాలకు గ్యాస్‌ను కేటాయించి ఎరువుల ఉత్పత్తిని పక్కన పెట్టాయి, నిల్వలను వాడుకున్నాయి. కానీ యుద్ధం త్వరగా ముగుస్తుందని చేసిన అంచనాలు తప్పాయి. పరిస్థితి ఇంకా జటిలంగా మారుతోంది.
యుఎన్ డిపి ప్రకటించిన లెక్కల ప్రకారం, ఈ సంక్షోభం వల్ల ఆసియా, పసిఫిక్ దేశాలకు 299 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశముంది. దాదాపు 8.8 కోట్ల మంది పేదరికంలోకి జారిపోయే ప్రమాదం పొంచి ఉందని ప్రకటించింది. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్కు చెందిన సమంత గ్రాస్ మాట్లాడుతూ “వనరులు తక్కువగా ఉన్న దేశాలు, చెల్లించే స్తోమత లేని వినియోగదారులే అన్నిటికంటే ముందు దెబ్బతింటారు” అని హెచ్చరించారు.
ఆసియా ప్రభుత్వాలు బడ్జెట్ వేసుకున్నప్పుడు చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్లు ఉంటుందని అంచనా వేశాయి. కానీ యుద్ధం కారణంగా బ్రెంట్ క్రూడ్ 120 డాలర్లకు చేరింది. ఇప్పుడు ప్రభుత్వాలు రెండు కష్టమైన నిర్ణయాల మధ్య ఇరుక్కుపోయాయి. సబ్సిడీలు కొనసాగిస్తే ఖజానాకు భారం, తొలగిస్తే ప్రజాగ్రహం.
ఫిలిప్పీన్స్ ప్రభుత్వం వారానికి నాలుగు రోజులు పని విధానం అమలు చేసింది. పేద కుటుంబాలకు సబ్సిడీలు ఇచ్చినా, మానిలా వంటి నగరాల్లో వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. థాయిలాండ్ లో యుద్ధం మొదలైన నెల రోజులలోపే డీజిల్ ధర పరిమితిని ఎత్తివేసింది. ఇతర వ్యయాలు కోస్తూ బడ్జెట్‌ను అదుపులో ఉంచుకోవడానికి నానా తంటాలు పడుతోంది.
వియత్నాం ఇంధన పన్నుల రద్దును పొడిగించింది. విమాన ఇంధన కొరత కారణంగా విమాన సర్వీసులు తగ్గాయి. జిడిపిలో 8 శాతం వాటా పర్యాటక రంగం కావడంతో నష్టాలు తీవ్రంగా ఉన్నాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్: దీర్ఘకాలిక ఒప్పందాలను వదిలి, మార్కెట్ ధరలకు చమురు కొనుగోలు చేయాల్సి వస్తోంది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది.
యుద్ధం ముగిసినా పరిస్థితి తక్షణం చక్కబడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దెబ్బతిన్న మౌలిక సదుపాయాల మరమ్మత్తు, ఉత్పత్తి పునఃప్రారంభం, పశ్చిమాసియా నుండి రవాణా సమయం ఇవన్నీ కలిపి వారాల నుండి నెలల సమయం పట్టవచ్చు. యురేషియా గ్రూప్‌కు చెందిన హెన్నింగ్ గ్లాయ్స్టెయిన్ “ఈ ఇంధన కొరత పరిస్థితి ఇంకా తీవ్రమవుతుంది” అని స్పష్టం చేశారు.
దేశాలు ఇప్పుడు భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాయి. చమురు సరఫరాదారులను వైవిధ్య పరచడం, సౌరశక్తి వంటి పునరుత్పాదక వనరులు, అణుశక్తి వంటి ప్రత్యామ్నాయాలపై చర్చలు జరుగుతున్నాయి. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిపుణుడు ఆల్బర్ట్ పార్క్ “యుద్ధం ఎంత కాలం కొనసాగితే, ఆర్థిక నష్టాలు అంత పెద్దవి అవుతాయి” అని హెచ్చరించారు.

More Stories
పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్యెల్యేల్లో తిరుగుబాటు
దేశంలో 60 రోజులకు సరిపడా ఇంధనం
తొలి ప్రత్యేక ఫార్మసీ రైలు ‘ఔషధి ఎక్స్ ప్రెస్’