ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ను ధ్వంసం చేసిన హెజ్బొల్లా!

ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ను ధ్వంసం చేసిన హెజ్బొల్లా!
లెబనాన్‌ దేశానికి చెందిన మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్లా  తాజాగా ఇజ్రాయెల్‌ కు చెందిన అత్యంత శక్తిమంతమైన గగనతల రక్షణ వ్యవస్థగా పేరుపొందిన ఐరన్ డోమ్‌ ను ఛేదించగలిగింది. ఐరన్ డోమ్‌ వ్యవస్థలో కీలక భాగమైన మిసైల్ లాంచింగ్ యూనిట్‌ను ఎఫ్‌పీవీ డ్రోన్‌తో ధ్వంసం చేసినట్టు హెజ్బొల్లా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫుటేజీని కూడా విడుదల చేసింది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం కొన్ని రోజుల క్రితమే ఈ దాడి జరిగింది. అయితే ఈ దాడి ఫుటేజీని సేకరించేందుకు హెజ్బొల్లా కొంత సమయం తీసుకున్నట్లు సమాచారం. హెజ్బొల్లా ప్రకటనపై ఇజ్రాయెల్ డిఫెన్స్ దళాలు ఇంకా స్పందించలేదు. ఎఫ్‌పీవీ డ్రోన్స్‌ను అడ్డుకోవడం ఇజ్రాయెల్ దళాలకు సవాలుగా మారిందన్న వార్తలు ఇప్పటికే అనేకం వెలువడ్డాయి.
సంప్రదాయక మిసైల్స్‌, రాకెట్స్‌, డ్రోన్స్‌ను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ అభివృద్ధి చేసుకున్న ట్రాకింగ్ వ్యవస్థలు, జామర్లు ఎఫ్‌పీవీ డ్రోన్‌ల విషయంలో తడబడుతున్నట్టు సమాచారం. రేడియో సిగ్నల్స్, జీపీఎస్ ద్వారా సంప్రదాయక డ్రోన్స్ తమ లక్ష్యాన్ని చేరుకుంటాయి. ఈ సిగ్నల్స్‌ను జామ్‌చేసి ఇజ్రాయెల్ వాటిని ధ్వంసం చేస్తోంది.
అయితే, ఎఫ్‌పీవీ డ్రోన్స్‌కు అనుసంధానమై ఉన్న ప్రత్యేక ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ద్వారా ఆపరేటర్లు వాటిని నియంత్రిస్తారు. డ్రోన్స్‌కు ఉన్న కెమెరాల ద్వారా అందే దృశ్యాలను చూస్తూ వాటిని లక్ష్యం వైపు నడిపిస్తారు. ఈ ఆప్టిక్ తీగల్లోని సిగ్నల్స్‌ను అడ్డుకోవడం జామర్స్‌కు సాధ్యం కాదు. ఫలితంగా ఎఫ్‌పీవీ డ్రోన్స్‌ తమ లక్ష్యాలను ధ్వంసం చేస్తున్నాయి.
ఈ ముప్పు గురించి ఇజ్రాయెల్ సైనికాధికారి ఒకరు ముందే అప్రమత్తం చేశారు. ఎఫ్‌పీవీ దాడుల నుంచి ఐరన్ డోమ్‌ను కాపాడుకోలేకపోతే నష్టం మరింత పెరుగుతుందని అన్నారు. ఇక పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇజ్రాయెల్ పలు ప్రయత్నాలు చేస్తోంది. ఎఫ్‌పీవీ డ్రోన్స్‌ను నుంచి ఐరన్ డోమ్ యూనిట్లకు రక్షణ భారీ వలలను ఏర్పాటు చేస్తోంది. ఈ వలలకు ఎఫ్‌పీవీ డ్రోన్స్ చిక్కి విఫలమవుతాయని ఇజ్రాయెల్ చెబుతోంది.