భారత్-బంగ్లాదేశ్‌ మధ్య టూరిస్ట్ వీసా సేవలు ప్రారంభం

భారత్-బంగ్లాదేశ్‌ మధ్య టూరిస్ట్ వీసా సేవలు ప్రారంభం
ఇటీవలి కాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు కాస్త బలపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఇటీవలే దౌత్య సేవలు ప్రారంభమయ్యాయి. రాయబార కార్యాలయాలు రెండు దేశాల్లో పని చేస్తున్నాయి. ఈ అంశంలో తాజాగా మరో ముందడుగు పడింది. రెండు దేశాల మధ్య టూరిస్ట్ వీసా సేవలు ప్రారంభం కానున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ సేవలు ప్రారంభమవుతుండటం విశేషం. ఈ విషయాన్ని బంగ్లాలో భారత రాయబారి దినేష్ త్రివేది వెల్లడించారు.
బంగభవన్‌లో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్‌కు త్రివేది లాంఛనంగా తన నియామక పత్రాలను సమర్పించిన రోజే ఈ ప్రకటన వెలువడింది. గౌరవ వందనంతో సహా పూర్తి లాంఛనప్రాయ స్వాగత కార్యక్రమం జరిగింది. అధ్యక్షుడు షహాబుద్దీన్ కొత్త రాయబారిని స్వాగతించి, తన పదవీకాలంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని వీసా జారీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 28 నుంచి టూరిస్ట్ వీసా సేవలు అందుబాటులోకి రానున్నాయి.  దీని ద్వారా బంగ్లాదేశ్‌ నుంచి ఇండియా రావాలనుకునే వారికి భారత పర్యాటక వీసాలు జారీ అవుతాయి. అలాగే, అనారోగ్యంతో బాధపడుతున్న బంగ్లా పౌరులు భారత్ లో వైద్యం చేయించుకోవాలి అనుకుంటే మానవతా కోణంలో స్పందించి భారత్ కు మెడికల్ వీసాలు కూడా జారీ చేస్తామని దినేష్ త్రివేది తెలిపారు.
వీసాల జారీకి బంగ్లాలో ఐదు కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. అవి ఢాకా, రాజ్‌షాహి, ఛిట్టగాంగ్, సిల్హెట్, ఖుల్నా.  భారతదేశం పర్యాటక వీసాలు మినహా అన్ని కేటగిరీలలో ప్రతిరోజూ 1500కు పైగా వీసాలను జారీ చేస్తుంది. వైద్య, ఇతర అత్యవసర వీసాలను ప్రాధాన్యత క్రమంలో ప్రాసెస్ చేశారు. అత్యవసర అవసరాలు ఉన్నవారు తమ దరఖాస్తులను సమర్పించడంలో సహాయపడటానికి కూడా ఏర్పాట్లు చేశారు.

జూన్ 12న పెట్రాపోల్-బెనాపోల్ సరిహద్దు మీదుగా రోడ్డు మార్గంలో ఢాకా చేరుకున్న త్రివేది, మే 2026 వరకు నాలుగేళ్లపాటు హై కమిషనర్‌గా పనిచేసిన ప్రణయ్ కుమార్ వర్మ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని బరాక్‌పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ పార్లమెంటు సభ్యుడైన త్రివేది, గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

2024లో అక్కడి ఇందిరా గాంధీ కల్చరల్ సెంటర్‌ను ధ్వంసం చేయడం నుంచి, భారత వీసా జారీ కేంద్రాలపై దాడులు వంటి కారణాలతో 2024 నుంచి వీసాల జారీ నిలిచిపోయింది. అప్పటి బంగ్లా పాలకుడు యూనస్ అనుసరించిన వైఖరి కూడా ఇందుకు కారణం.