మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు, 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) 108 స్థానాలను గెలుచుకొని, అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడంతో పూర్తి మెజారిటీకి మరో 11 సీట్లు తక్కువగా ఉన్నప్పటికీ అందరూ ఆయనను ముఖ్యమంత్రి అయిన్నట్లే భావించారు. అయితే, ప్రభుత్వంలో భాగస్వామి కావాలని కాంగ్రెస్ నాయకత్వం ప్రదర్శించిన అత్యుత్సాహం రాష్ట్ర రాజకీయాలలో కల్లోలం సృష్టించింది.
ఐదు రోజులపాటు జరిగిన రాజకీయ పరిణామాలను గమనిస్తే అందరూ కేవలం ఒక్క ఎమ్యెల్యే సీటు మాత్రమే గెల్చుకున్న బీజేపీని చూసి భయపడినట్లు స్పష్టం అవుతుంది. హంగ్ అసెంబ్లీని సాకుగా తీసుకొని ఆ పార్టీ ఎక్కడ రాజకీయంగా ప్రయోజనం పొందుతుంది అనే భయంతో ఏ పార్టీ కూడా విజయ్ ముఖ్యమంత్రి కావడానికి అడ్డుగా నిలబడలేదు. చివరకు అధికారం కోల్పోయిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సహితం అతిపెద్ద పార్టీగా విజయ్ కె అవకాశం ఇవ్వాలని, తాము ప్రభుత్వం ఏర్పర్చేందుకు అడ్డుకాబోమని అం టూ స్పష్టం చేస్తూ వచ్చారు.
అయితే, గవర్నర్ కేవలం నిబంధనలను పాటిస్తున్నారని చెబుతూ బీజేపీ ఈ వ్యవహారానికి దూరంగా ఉంది. ఆ పార్టీ నాయకులు సహితం అటు, ఇటుగా విజయ్ ముఖ్యమంత్రి అవుతారని చెబుతూ వచ్చారు. ఈ సందర్భంగా రాజ్యాంగబద్ధత, పూర్ వపు ఉదాహరణలపై చర్చ తీవ్రంగా కొనసాగింది. ఈ మొత్తం వ్యవహారంలో, గోవాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, జనవరి 2025 నుండి కేరళ గవర్నర్‌గా పనిచేస్తూ, ఈ ఏడాది మార్చిలో మాత్రమే తమిళనాడు అదనపు బాధ్యతలు స్వీకరించిన గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఎంతో హుందాగా, ఎక్కడా వివాదాస్పద ప్రకటనలు చేయకుండా నిలిచారు.
ఆయన మూడు రోజుల్లో మూడుసార్లు విజయ్ను కలిశారు, కానీ ప్రతిసారీ మెజారిటీ మద్దతుకు లిఖితపూర్వక రుజువు లేదని పేర్కొంటూ, అధికారిక ఆహ్వానం పంపడానికి నిరాకరించారు. శనివారం, సాయంత్రం 7:10 గంటలకు తిరువనంతపురం (కేరళ)కు విమానం ఎక్కాల్సి ఉన్నప్పటికీ, విజయ్ అభ్యర్థనపై అర్లేకర్ తన ప్రయాణంను రద్దు చేసుకుని, సాయంత్రం 6:30 గంటలకు విజయ్ ప్రతినిధి బృందాన్ని కలిశారు. విజయ్‌కు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మాత్రమే తుది మద్దతు లేఖలు అందడంతో ఈ మొత్తం అస్పష్టతకు ముగింపు లభించింది. ఆదివారం ఉదయం విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ వ్యవహారంపై రాజకీయ పార్టీలలో నెలకొన్న భయాందోళనలకు ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి. విజయ్ తగిన మద్దతు తెలిపే లేఖలు అందజేయలేకపోతే రాష్ట్రపతి పాలన రావచ్చని ఆందోళన ఒకవైపు ఏర్పడింది. ఎందుకంటె, స్టాలిన్ పదవీకాలం మే 10 నాటికి గూగిసింది. అప్పటిలోగా ప్రభుత్వం ఏర్పడకపోతే గవర్నర్ అసెంబ్లీని సస్పెన్షన్ లో ఉంచి, రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయవచ్చని భయపడ్డారు.
మరో కీలకమైన భయం ఏమిటంటే, కొత్తగా ఏర్పడిన 17వ తమిళనాడు శాసనసభలో బీజేపీకి కేవలం ఒక్క సీటు మాత్రమే ఉన్నప్పటికీ రాష్ట్రపతి పాలనా విధిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో పరోక్షంగా బిజెపి అధికారం కొనసాగుతుందని బిజెపి మిత్రపక్షం ఏఐడీఎంకేతో సహా అందరూ భయపడ్డారు. రాష్ట్ర స్వయంప్రతిపత్తి పట్ల బలమైన సంప్రదాయం, కేంద్ర ప్రభుత్వంపై ప్రగాఢమైన అనుమానం ఉన్న తమిళనాడులో, రాష్ట్రపతి పాలన విధించే అవకాశం చాలా ప్రాంతీయ పార్టీలకు రాజకీయంగా ఆందోళనకరమైన అంశమే.
అందుల్లనే విజయ్ కు మద్దతు ఇచ్చే విషయంలో మొదట్లో అస్పష్టంగా వ్యవహరించిన వామపక్షాలు, వీసీకే చివరకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. వారు ఒక వంక డీఎంకేతో పొత్తు కొనసాగిస్తూనే విజయ్ కు మద్దతు తెలపడం గమనార్హం. అందుకు వారు చెప్పిన ప్రధాన కారణం తమిళనాడులో `మతతత్వ శక్తులు’, అంటే బీజేపీకి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే. అంటే కేవలం ఒక ఎమ్యెల్యే ఉన్న బిజెపి కనుసన్నలలో ప్రభుత్వం ఎక్కడ ఉంటుందో అనే భయం ప్రకటించారు.
వాస్తవానికి ఎన్నికల ఫలితాలు రాగానే అతిపెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని కోరి, అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటామని విజయ్ చెప్పివుంటే గత సంప్రదాయాల ప్రకారం ఆమోదం తెలపక గవర్నర్ అర్లేకర్ కు మరో మార్గం ఉండెడిది కాదు. గతంలో గోవా స్పీకర్ గా అన్ని పక్షాలతో ఎంతో హుందాగా వ్యవహరించారనే పేరు ఆయనకు ఉంది. ముఖ్యమంత్రి కావాల్సింది గవర్నర్ అయ్యారు. అయినా ఆయన ఏనాడూ బీజేపీలో అసంతృప్తి వ్యక్తం చేయలేదు. నిబద్దతతో తన బాధ్యతలు నెరవేర్చేవారుగా పేరొందారు.
విజయ్ ముఖ్య సలహాదారులు సహితం అతిపెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుకోసం గవర్నర్ ను కలవమని సలహా ఇచ్చారని తెలుస్తోంది. అందుకు సిద్ధమైన సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విజయ్ కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ముందుకు వచ్చి, తమ పార్టీ మద్దతు లేఖతో పాటు గవర్నర్ ను కలవమని వత్తిడి తెచ్చినట్లు తెలుస్తోం ది. ఆ విధంగా చేయడం ద్వారా విజయ్ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కాకుండా, కాంగ్రెస్ మద్దతుతో `సంకీర్ణ ప్రభుత్వం’ ఏర్పాటు చేసినట్లు సంకేతం ఇవ్వాలని తొందరపడిన్నట్లు స్పష్టం అవుతుంది.
ఈ క్రమంలో ఎన్నికలలో ఓడిపోయిన డీఎంకే నేతృత్వంలోని కూటమితో ఏకపక్షంగా సంబంధాలు తెంచుకున్న తొలి ప్రధాన పార్టీగా భారత జాతీయ కాంగ్రెస్ నిలిచింది. కనీసం ఈ నిర్ణయం తీసుకునే ముందు మిగిలిన పార్టీల మాదిరిగా స్టాలిన్ తో సంప్రదింపులు జరిపినా గౌరవంగా ఉండెడిది. అందుకనే ఆగ్రహంతో వెంటనే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నుండి వైదొలగక ఆ పార్టీకి తప్పలేదు.
తగిన రాజకీయ అనుభవం లేకపోవడం, అనుభవజ్ఞులతో సంప్రదించే అవకాశం లేకుండా కాంగ్రెస్ నుండి వత్తిడులు రావడంతో విజయ్ హడావుడిగా గవర్నర్ ను కలిసి కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామంటూ లేఖను అందజేశారు. పైగా. తన లేఖలో తనకు 120 మంది ఎమ్యెల్యేల మద్దతు ఉందని పేర్కొంటూ, మద్దతు దారులలో కేవలం కాంగ్రెస్ నుండి మాత్రమే లేఖ ఉండడంతో మిగిలిన వారి సంగతి ఏమిటి? అని గవర్నర్ అడగాల్సి వచ్చింది.
ఎన్నికలలో రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ చేసిన కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం `ఎన్నికల అనంతరం కూటమి’ కిందకు వస్తుంది. ఎన్నికల అనంతరం కూటమి ఏర్పర్చుతున్నట్లు సంకేతం ఇస్తే, సభలో `పూర్తి మెజారిటీ’ ఉందని ఆధారాలు సమర్పించక తప్పదు. గవర్నర్ ఈ ప్రశ్న లేవనెత్తడంతొ విజయ్ షాక్ కు గురికావాల్సి వచ్చింది.
డిఎంకెకు మాటమాత్రం కూడా చెప్పకుండా విజయ్ కు మద్దతును ప్రకటిస్తూ తమిళనాడు ఏఐసీసీ ఇన్చార్జి గిరీష్ చోడంకర్ సంతకంతో మే 6న ఒక వెలువడిన అధికారిక ప్రకటనలో ఒక షరతును కూడా చేర్చారు. “భారత రాజ్యాంగాన్ని విశ్వసించని ఏ మతతత్వ శక్తులనైనా టీవీకే ఈ కూటమికి దూరంగా ఉంచితేనే మా మద్దతు ఉంటుంది.” ఈ వ్యాఖ్య ఏఐఏడీఎంకేలో జూనియర్ భాగస్వామి అయిన బీజేపీని ఉద్దేశించి చేశారని అందరికి తెలిసిందే.
డీఎంకేతో ఎన్నికల పొత్తు ఏర్పర్చుకొంటున్నా ఆ పార్టీ ఎన్నడూ అధికారంలో కాంగ్రెస్ కు భాగస్వామ్యం ఇవ్వలేదు. దానితో 1967 నుండి తమిళనాడులో అధికారంలో దూరంగా ఉంటూ వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు విజయ్ రూపంలో అధికారంలో భాగస్వామ్యం పొందే అవకాశం ఏర్పడడంతో ఆ అవకాశం ఎక్కడ చేజారిపోతుందనే ఆదుర్దాతో హడావుడిగా వ్యవహరించడంతో ఈ సమస్యలు అన్ని వచ్చాయని వెల్లడవుతుంది. అయితే తమ `అధికార దాహం’ను కపిపుచ్చుకొనేందుకు ఒకే ఎమ్యెల్యే ఉన్న బిజెపిని అధికారంకు దూరంగా ఉంచాలనే `సైద్ధాంతిక కారణం’ చెప్పే ప్రయత్నం చేశారు.
పైగా, గవర్నర్ నిర్ణయం పట్ల విజయ్, ఆయన పార్టీ బహిరంగా ఎక్కడా అసహనం, అసంతృప్తి వ్యక్తం చేయకుండా హుందాగా వ్యవహరించారు. కానీ కాంగ్రెస్ మాత్రమే అసహనంకు గురయింది. గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు కూడా కాంగ్రెస్ ప్రకటించింది. సిపిఐ, సిపిఎం కూడా మే 8న తమ రాష్ట్ర కమిటీల సమావేశాలు నిర్ణయించి కాంగ్రెస్ మాదిరిగానే ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు “షరతులు లేని మద్దతు”ను ప్రకటించాయి. “పరోక్షంగా బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికే మేము టీవీకేకు మద్దతు ఇస్తున్నాము” అంటూ ఆ రెండు పార్టీలు కూడా ప్రకటించాయి.
విజయ్ కు మద్దతు ఇచ్చే విషయంలో దాగుడు మూతలు ఆడిన వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ చివరకు మాట్లాడినప్పుడు “రాష్ట్రపతి పాలనను నివారించడానికి మనం విజయ్‌కు మద్దతు ఇవ్వాలి. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము అడ్డంకిగా ఉండము. ఈ రెండు కారణాల వల్లే మేము మా మద్దతును అందించాము. దీనికి మరో రాజకీయ సమర్థన లేదు,” అని ప్రకటించారు. ఆ విధంగా పరోక్షంగా బిజెపిని అడ్డుకొనేందుకు అనే సంకేతం ఇచ్చారు.
వీటన్నిటిలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) వైఖరి అత్యంత అసాధారణంగా ఉంది. పార్టీ నాయకుడు కేఏఎం ముహమ్మద్ అబూబక్కర్ టీవీకేకు మద్దతు ప్రకటిస్తూనే, ఐయూఎంఎల్ డీఎంకే నేతృత్వంలోని కూటమిలోనే ఉంటుందని ప్రకటించారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, తాము ప్రతిపక్షంగానే పనిచేస్తామని, విజయ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు అడ్డురాబోమని చెబుతూనే మరోవంక రెండు ద్రావిడ పార్టీల మధ్య సయోధ్యతో ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలకు ఆజ్యం పోశారు.

More Stories
ఎబివిపికి సైద్ధాంతిక స్పష్టత, సంస్థాగత దార్శనికత అందించిన కేల్కర్
ప్రతిపక్షాల ఐక్యతకై మమతా పిలుపును తిరస్కరించిన కాంగ్రెస్, లెఫ్ట్
తెలంగాణలో ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే