కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను పెంచిన కంపెనీలు

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను పెంచిన కంపెనీలు
యుద్ధం పర్యవసానంగా ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయంటూ దేశంలోని ఎరువుల కంపెనీలు కాంప్లెక్స్‌ల ధరలను భారీగా పెంచేశాయి. మ్యూరేట్‌ ఆఫ్‌ ‌పొటాష్‌ (ఎంఒపి) రేట్లను సైతం పెంచాయి. పెరిగిన ధరలు తక్షణం అమల్లోకొస్తాయని తెలిపాయి. ప్రస్తుతం మార్కెట్‌‌లో కొత్త ఎంఆర్‌‌పిలపైనే ఎరువుల అమ్మకాలు సాగుతున్నాయి.  నత్రజని, భాస్వరం, పొటాషియం (ఎన్‌,పి,కె)లకు కేంద్రం పోషకాధారిత సబ్సిడీ (ఎన్‌‌బిఎస్‌) ‌పథకం కింద కొంత మొత్తంలో సబ్సిడీ ఇస్తుంది.
అంతర్జాతీయంగా గ్యాస్‌, చమురు, ముడి సరుకు ధరల పెరుగుదల, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను చూపించి ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయని, సబ్సిడీ పెంచాలని కంపెనీలు కేంద్రాన్ని కోరాయి.  కంప్లెక్స్‌ ఎరువుల ధరలు 50 కిలోల బస్తాపై రూ.225 నుంచి 300 వరకు పెంచాయి. ఎంఒపి రేట్లను బస్తాకు రూ.125 పెంచాయి. ఖరీఫ్‌ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న వేళ కంపెనీలు అదను చూసి ధరలు పెంచాయి.
ఇక్కడితో ధరల పెంపు ఆగదని, కేంద్రం సబ్సిడీ పెంచకపోతే త్వరలో బస్తాపై మరో రూ.200 నుంచి 300 వరకు పెంచే అవకాశం ఉందని మార్కెట్‌ ‌వర్గాలు చెబుతున్నాయి. 
కాంప్లెక్స్‌‌ ఎరువుల పెరుగుదల వలన ఆంధ్ర ప్రదేశ్ రైతాంగంపై ఏడాదికి రూ.800 కోట్లు అదనపు భారం పడనున్నట్లు ప్రాధమిక అంచనా. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఖరీఫ్‌‌లో ఆరున్నర లక్షల టన్నుల కాంప్లెక్స్‌‌లను రైతులు వినియోగిస్తున్నారు.
అదనపు భారం రూ.325 కోట్లు. రబీలో 9.50 లక్షల టన్నుల వాడకం ఉంది. దానిపై మరో రూ.475 కోట్ల అదనపు భారం పడుతుంది.  ఎంఒపి ఖరీఫ్‌‌లో లక్ష టన్నులు వినియోగిస్తున్నారు. బస్తాపై రూ.125 పెరుగుతోంది. ఆ లెక్కన రూ.25 కోట్లు, రబీలో 80 వేల టన్నుల వాడకంపై మరో రూ.20 కోట్ల అదనపు భారం పడుతుంది. మరో విడత కంపెనీలు ధరలు పెంచితే రైతులపై పడే భారం ఇంకా ఎక్కువవుతుంది.