* శివసేన మంత్రి సంజయ్ షిర్సత్ ఆరోపణ
నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కార్యాలయంలో జరిగిన లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలకు సంబంధించి ప్రధాన నిందితురాలైన నిదా ఖాన్ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఏఐఎంఐఎం నాయకులు సహాయపడ్డారని శివసేన మంత్రి సంజయ్ షిర్సత్ ఆరోపించారు.
దీనిని ఆయన ‘కార్పొరేట్ జిహాద్’గా అభివర్ణించారు.
టీసీఎస్ లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణల కేసులో ఎనిమిది మంది నిందితులలో ఒకరైన నిదా ఖాన్‌ను 45 రోజుల అనంతరం ఛత్రపతి సంభాజీ నగర్లో పోలీసులు అరెస్టు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, నిదా ఖాన్ పరారీలో ఉన్నప్పుడు ఏఐఎంఐఎం నాయకుల నుంచి మద్దతు అందుకుందని స్పష్టం చేశారు. ఈ విషయమై ఆ పార్టీ నాయకురాలిపై క్రిమినల్ చర్యలు, విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (ఎంసీఓసీఏ) కింద ఏఐఎంఐఎం నాయకులపై అభియోగాలు మోపాలని చెబుతూ ఈ విషయమై తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలుస్తానని శివసేన నాయకుడు తెలిపారు. ఏఐఎంఐఎం మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్‌ను లక్ష్యంగా చేసుకుంటూ మాట్లాడుతూ, మహారాష్ట్రలో ఏఐఎంఐఎం ఇటువంటి కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని షిర్సత్ ఆరోపించారు.
“ఏఐఎంఐఎం ద్వారా ఇటువంటి కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారి నాయకత్వంలో మత మార్పిడులు, బాలికలను వలలో వేయడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి,” అని ఆయన ఆరోపించారు. “ఇది ఒక పెద్ద కుట్ర. నిదా ఖాన్ కేవలం ఒక పావు మాత్రమే. ఈ నెట్వర్క్ మహారాష్ట్ర అంతటా విస్తరించి ఉంది. అహ్మద్‌నగర్, పూణే, ఛత్రపతి సంభాజీనగర్‌లో కూడా ఇలాంటి సంఘటనలు జరగవచ్చు. హిందూ మతంపై విషం వ్యాపింపజేస్తున్నారు. ఇది సమాజంలో ఆగ్రహానికి దారితీస్తుంది,” అని ఆయన హెచ్చరించారు.
ఖాన్ పరారీలో ఉన్నప్పుడు ఆమెకు సహాయం అందిందని ఆరోపిస్తూ, మంత్రి మాజీ ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. జలీల్ ఆమెకు అనుకూలంగా విలేకరుల సమావేశంలో ప్రసంగించి బహిరంగంగా ఖాన్‌కు మద్దతు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. నాసిక్ పోలీసుల నుండి అందిన సమాచారాన్ని ఉటంకిస్తూ, ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఏఐఎంఐఎం కార్పొరేటర్ మతిన్ మజీద్ పటేల్ నివాసంలో ఖాన్ ఐదు రోజులు బస చేశారని షిర్సత్ పేర్కొన్నారు.
నాసిక్ పోలీసుల సిట్ దర్యాప్తు ప్రకారం, ఖాన్ పరారీలో ఉన్న సమయంలో స్థానిక ఏఐఎంఐఎం కార్పొరేటర్ మజీద్ పటేల్ ఆమెకు నరేగావ్లో ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కార్పొరేటర్ మజీద్ పటేల్‌ను నిందితుడిగా చేర్చినట్లు వారు తెలిపారు. అలాగే, ‘కార్పొరేట్ జిహాద్’ నెట్‌వర్క్‌గా ఆరోపించబడుతున్న అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని తాను కోరుతానని ఆయన చెప్పారు. ఈ కేసు వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించేలా చూడాలని, ఈ డిమాండ్‌ను తాను ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. నిందితుల్లో కొందరి ఆర్థిక నేపథ్యంపై కూడా మంత్రి సందేహాలు వ్యక్తం చేశారు.
“నిరుద్యోగులైన యువకుల వద్ద ఖరీదైన బైక్‌లు, ఐఫోన్లు ఎలా ఉంటున్నాయి? ఈ డబ్బు మూలాలపై తప్పక విచారణ జరపాలి,” అని ఆయన స్పష్టం చేశారు. ఖాన్ పరారీలో ఉన్న సమయంలో దాదాపు రెండు నెలల పాటు ఛత్రపతి శంభాజీనగర్‌లో ఎందుకు మకాం వేసినట్లు ఆరోపణలు వచ్చాయి? ఏఐఎంఐఎం నాయకులు ఆమెకు ఎందుకు మద్దతు ఇచ్చినట్లు చెబుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఆమె గర్భవతిని అని తప్పుడు సమాచారం ఎందుకు సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి? అంటూ విస్మయం వ్యక్తం చేశారు.

More Stories
ఎస్ఐఆర్ ప్రక్రియ పశ్చిమ బెంగాల్‌ను బీజేపీకి గెలిపించిందా?
తమిళనాడులో వామపక్షాలు మద్దతు ఇస్తున్నా ఉత్కంఠ!
కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు ప్రకటించిన డిఎంకె