భారీ ప్రక్షాళన దిశలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు  

భారీ ప్రక్షాళన దిశలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు  

ఐపిఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నాయి. పేలవ ప్రదర్శన కనబరిచిన జట్ల కెప్టెన్‌లు, కోచింగ్ స్టాఫ్ స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఇటీవల వార్తలు వస్తున్నాయి.  సుమారు ఎనిమిది మంది సీనియర్ ఆటగాళ్లు, ఇద్దరు కెప్టెన్లు 2026 తర్వాత ఐపిఎల్ నుండి రిటైర్ కావచ్చు. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించని జట్లు కొత్త నాయకత్వంతో 2027లోకి వెళ్లాలని చూస్తున్నాయి.

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపిఎల్ రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎన్నో విజయాలు అందించిన ధోనీ ఈ సీజన్ అనంతరం తన ఐపిఎల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని సమాచారం. అతని స్థానంలో కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని జట్టు యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

చెన్నై సూపర్ కింగ్స్‌ సారథి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని బాధ్యతల నుంచి తప్పించి సంజు శాంసన్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఇది జరిగితే సీఎస్‌కేలో పెద్ద మార్పుగా భావించాలి. పలు జట్ల మేనేజ్‌మెంట్‌లో కూడా మార్పులు ఉండవచ్చు. 

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, కోచ్ లక్ష్మీపతి బాలాజీలను బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉందని సమాచారం. అలాగే సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్‌పై కూడా ఒత్తిడి పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కెప్టెన్ రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అతని ప్రదర్శన, జట్టు సమతుల్యతపై మేనేజ్‌మెంట్ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

కోల్‌కతా నైట్ రైడర్స్‌లో అజింక్య రహానే, కోచ్ అభిషేక్ నాయర్ స్థానాలు ప్రమాదంలో ఉన్నాయని సమాచారం. జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం ఈ నిర్ణయాలకు కారణమవుతోంది. రాజస్థాన్ రాయల్స్‌లో కూడా పెద్ద మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. రియాన్ పరాగ్‌ను జట్టు నుంచి తప్పించి యువ స్టార్ యశస్వి జైస్వాల్‌కు కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 

ముంబయి ఇండియన్స్‌లో కూడా కెప్టెన్సీ మార్పు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యను బాధ్యతల నుంచి తప్పించి స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ అప్పగించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. హార్దిక్ పాండ్యా, అజింక్య రహానే సహా మరికొందరు కెప్టెన్లు కఠిన నిర్ణయాలను ఎదుర్కోవాల్సి రావచ్చు.