భారత-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉన్న మణిపూర్‌లోని కామ్‌జోంగ్ జిల్లాలో, గురువారం తెల్లవారుజామున భారీగా ఆయుధాలు కలిగిన మిలిటెంట్లు పలు గ్రామాలపై దాడి చేసి, ఇళ్లకు నిప్పుపెట్టారని, దీంతో స్థానికులు ప్రాణభయంతో పారిపోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, దాడి చేసినవారు కాసోమ్ ఖుల్లెన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నామ్లీ, వాంగ్లీ. చోరో అనే తంగ్‌ఖుల్ నాగ గ్రామాలను ఉదయం 4 గంటల ప్రాంతంలో లక్ష్యంగా చేసుకున్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సమీపంలోని అడవుల్లోకి పారిపోయినట్లు సమాచారం. ఈ గ్రామాలు అంతర్జాతీయ సరిహద్దుకు ఒక కిలోమీటరు కంటే తక్కువ దూరంలోనే ఉన్నాయి. దాడి సమయంలో పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కనీసం ఒక వృద్ధురాలికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. నామ్లీలో రెండు ఇళ్లు, వాంగ్లీలో మూడు నుంచి నాలుగు ఇళ్లు, చోరోలో ఒక చర్చి మినహా మిగిలిన అనేక ఇళ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయని గ్రామస్తులు పేర్కొన్నారు.
పరిస్థితిని సమీక్షించడానికి అస్సాం రైఫిల్స్ బృందాలతో సహా భద్రతా సిబ్బంది ఆ తర్వాత ప్రభావిత గ్రామాలకు చేరుకున్నారు. ఈ దాడి సరిహద్దు ఆవల నుండి, మయన్మార్ కేంద్రంగా పనిచేస్తున్న మిలిటెంట్ సంస్థలైన ‘కుకీ నేషనల్ ఆర్మీ (బర్మా)’ , ‘పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (పిడిఎఫ్)’ ద్వారా జరిగిందని ఫుంగ్యార్ ఎమ్మెల్యే ఎల్. కీషింగ్ ఆరోపించారు.
“ఇప్పటివరకు రాష్ట్రంలో అంతర్గత ఘర్షణలే కనిపించేవి, కానీ ఈ రోజు బాహ్య దురాక్రమణ జరిగింది. కుకీ నేషనల్ ఆర్మీ-బి, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ సంయుక్త దళం తెల్లవారుజామున 3:30 గంటలకు నాలుగు నుంచి ఐదు సరిహద్దు గ్రామాలపై దాడి చేసింది,” అని కీషింగ్ విలేకరులతో పేర్కొన్నారు.
“ప్రాణనష్టం ఏమీ జరగకపోయినప్పటికీ, అనేక ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు ఇంకా ఆచూకీ లేకుండా పోయారు. ఆయుధాలు కలిగిన మిలిటెంట్లు వారిని తీసుకువెళ్లారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు” అని నాగ పీపుల్స్ ఫ్రంట్ శాసనసభ్యుడు పేర్కొన్నారు. ఈ ఘటనను “బాహ్య దురాక్రమణ”గా అభివర్ణిస్తూ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండూ మౌనంగా ఉండకూడదని స్పష్టం చేశారు. అయితే, ఈ దహనకాండలో తమకు ఎటువంటి ప్రమేయం లేదని కుకీ నేషనల్ ఆర్మీ-బి ఖండించింది. ఈ ఆరోపణలను “అసత్యమైనవి, దురుద్దేశపూరితమైనవి”గా కొట్టివేసింది. .
ప్రభావిత గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మణిపూర్ పోలీస్ కమాండోలను మోహరించాలని సదరన్ టాంగ్‌ఖుల్ స్టూడెంట్స్ యూనియన్‌గా కూడా పిలువబడే టాంగ్‌ఖుల్ అజే కటమ్నావో లాంగ్ (టిఎకెఎల్),డిమాండ్ చేసింది. అలాగే, దాదాపు 100 మంది సాయుధ మిలిటెంట్లు ఎవరికీ తెలియకుండా అంతర్జాతీయ సరిహద్దును దాటడానికి కారణమైన భద్రతా లోపంపై వివరణ కోరింది.

More Stories
సీమాంతర ఉగ్రవాదంతోనే సింధూ జలాల ఒప్పందం నిలిపివేత
భారీ ప్రక్షాళన దిశలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు
సువెందు పిఎ హత్యపై దర్యాప్తుకు సిట్