తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటులో రాజకీయ అనిశ్చితి

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటులో రాజకీయ అనిశ్చితి
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తమిళనాట సస్పెన్స్‌ ‌కొనసాగుతోంది. టివికె అధినేత విజయ్‌ ‌చేస్తున్న కసరత్తు బుధవారం రాత్రికికూడా ఒక కొలిక్కి రాలేదు. వివిధ పార్టీలతోనూ, నూతనంగా ఎన్నికైన ఎంఎల్‌ఏలతోనూ ఆయన మంతనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్‌ ‌పార్టీ మద్దతు ప్రకటించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం విజయ్‌‌కు లభించలేదు. 
 
తాము సెక్యులర్‌ ‌ఫ్రంట్‌‌లోనే కొనసాగతామని వామపక్ష పార్టీల నేతలు ప్రకటించారు. విసికె పార్టీ కూడా అదేబాటన నడుస్తుంది. దీంతో కాంగ్రెస్‌ ఇచ్చిన మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతివ్వాలని, రెండు వారాల్లో సంఖ్యాబలాన్ని నిరూపించుకుంటానంటూ విజయ్‌ ‌చేసిన విజ్ఞప్తిని తమిళనాడు గవర్నర్‌ ‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ ‌తిరస్కరించారు. దీంతో గురువారం తలపెట్టిన ప్రమాణస్వీకార కార్యక్రమం రద్దయింది. 
 
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 108 గెల్చుకొని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినా, మ్యాజిక్‌ మార్క్‌ 118 సీట్లకు 10 సీట్ల దూరంలో నిలిచింది. దీంతో కాంగ్రెస్ (5) బలంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటు కోసం కసరత్తు ముమ్మరం చేసింది.  అయితే ఐదుగురు సభ్యులు ఉన్న కాంగ్రెస్‌ మద్దతు సహా, విజయ్ నెగ్గిన రెండు చోట్లలో ఒకదాన్ని మినహాయిస్తే, టీవీకే బలం 112కు అవుతుంది. అయినప్పటికీ ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. 
 
అటు విజయ్‌ పార్టీకి అన్నాడీఎంకే మద్దతిస్తుందనే ప్రచారాన్ని ఆ పార్టీ తోసిపుచ్చింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని అన్నాడీఎంకే నేత కేపీ మునుస్వామి వెల్లడించారు. దీంతో విజయ్​కు ఇంకా ఎవరెవరు మద్దతిస్తారో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటకు విజయ్‌ను గవర్నర్‌ ఆహ్వానించలేదని తెలుస్తోంది. 118 మంది సభ్యుల బలం చేకూరిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుకు రావాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఆ రాష్ట్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ అనిశ్చి నేపథ్యంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని హెచ్చరింది. ముఖ్య ప్రాంతాల్లో భద్రతను పెంచాలని కేంద్ర హోంశాఖ సూచించింది.  మరోవైపు ఎఐడిఎంకె నుండి పెద్ద సంఖ్యలో ఎంఎల్‌ఏలు విజయ్‌‌కు మద్దతు తెలపనున్నారన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. 
ఎఐడిఎంకెకు చెందిన 30 నుండి 35 మంది ఎంఎల్‌ఏలు ఎఐడిఎంకె నేత రాజ్యసభ ఎంపి షణ్ముగమ్‌ ‌నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారం.
టివికెకు మద్దతిచ్చేలా పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామిని ఒప్పించాలని ఈ సమావేశంలో వారు కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం జరగాల్సిన ఎఐడిఎంకె శాసనసభ పక్ష సమావేశాన్ని పళనిస్వామి వాయిదావేశారు.  మరోవైపు టివికె నేతలు కూడా పళనిస్వామితో మాట్లాడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అధిష్టానం నుండి సానుకూల నిర్ణయం రాకపోతే, పార్టీని చీల్చిఅయినా విజయ్‌‌కు మద్దతు తెలపాలని ఎఐడిఎంకె ఎంఎల్‌ఏలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
ఈ పరిణామాలు జరుగుతుండగానే ప్రభుత్వ ఏర్పాటు దిశలో డిఎంకె, ఎఐడిఎంకే నేతలు చర్చిస్తున్నారంటూ కొన్ని ఛానళ్లలో వచ్చిన వార్తలు కలకలం రేపాయి.  బిజెపి, కాంగ్రెస్‌‌లను దూరంగా ఉంచి, మిగిలిన పార్టీల మద్దతుతో ప్రభత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈ చర్చలు సాగుతున్నట్లు ఆ మీడిమా సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఈ వార్తలను డిఎంకె నేతలు ఖండించారు.  ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్షంలోనే కొనసాగాలని డీఎంకే నిర్ణయించింది. 
 
టీవీకే  ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోపోబోమని ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సింగిల్‌ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఆవిర్భవించి నందున ప్రభుత్వం ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఆరు నెలల విజయ్‌ పాలన చూసిన తర్వాతనే తాను మాట్లాడుతానని చెబుతూ మళ్లీ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం తమ పార్టీకి లేదని తేల్చి చెప్పారు. డీఎంకే లోక్‌సభ ఎంపీ కలానిధి వీరస్వామి మాట్లాడుతూ, టీవీకే ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకునేందుకు ఏఐఏడీఎంకే ప్రయత్నిస్తోందని ఆరోపించారు