* తమిళనాడులో విజయ్ కు కాంగ్రెస్ మద్దతు
కేరళంలో పదేళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం రావడంతో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవికోసం కాంగ్రెస్ నేతల మధ్య పరుగు ప్రారంభమైంది. ఇప్పటి వరకు శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత వి.డిసతీషన్‌తో పాటు, సీనియర్ నేతలు కెసి వేణుగోపాల్, రమేష్ చెన్నితాల తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి పదవి విషయమై బహిరంగంగా మాట్లాడవద్దని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
రేసులో ఉన్న నేతలతో పాటు, వారి అనుచరులుకూడా పోటాపోటాగా ప్రకటనలు, మీడియాకు లీక్‌లు ఇస్తున్నారు. మంగళవారం ఉదయాన్నే కెసి వేణుగోపాల్ నివాసం వద్ద ‘నిజమైన హీరో’ అంటూ ఫ్లెక్సీలు కనిపించాయి. ఆ తర్వాత కాసేపటికే మిగిలిన నేతల ఇళ్ల వద్ద కూడా అటువంటి ఫ్లెక్సీలే కనిపించాయి. పార్టీని గెలిపించిన తనకు సిఎం పదవిని ఇవ్వాలని సతీషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
సుదీర్ఘకాలం(2016-2021) ప్రతిపక్షనేతగా బాధ్యతలు నిర్వహించిన తనకు ఆ పదవి ఇవ్వాలని రమేష్ చెన్నితాల అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతగా రాష్ట్రంలోనూ, ఎఐసిసిలోనూ సేవలందిచిన తనను ఎలా విస్మరిస్తారని కెసి వేణుగోపాల్ ప్రశ్నిస్తున్నారు. నేతల మధ్య నెలకొన్న పోటాపోటీతో సిఎల్‌పి సమావేశాన్ని ఎప్పడు నిర్వహిస్తారన్న అంశంపై కూడా స్పష్టత లేని పరిస్తితి ఏర్పడింది.
నూతనంగా ఎన్నికైన ఎంఎల్‌ఏలు కూడా నేతల వారీగా చీలిపోయారు. కాంగ్రెస్ నుండి ఎన్నికైన 63 మంది ఎంఎల్‌ఏలలో 35 మంది, మిత్రపక్షాలనుండి ఎనిమిది మంది ఎంఎల్‌ఏలు తమను బలపరుస్తున్నట్లు కెసి వేణుగోపాల్ గ్రూప్ ఢిల్లీలో మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే ఏర్పాటు చేసిన సమావేశానికి కొంత ముందు కెసి వేణుగోపాల్ గ్రూపు నుండి ఈ ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది.
ఏఐసీసీలో కీలక వ్యక్తిగా సీట్ల కేటాయింపులో నిర్ణయాత్మక పాత్ర వహించిన వేణుగోపాల్ పార్టీ ఎమ్యెల్యేలలో అత్యధికులు తనకే మద్దతు ఇస్తారని ధీమాతో ఉన్నారు. పైగా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సన్నిహితుడిగా పేరొందారు. మరోవైపు యుడిఎఫ్‌లో భాగస్వామి పార్టీ అయిన ముస్లింలీగ్ ఐదు మంత్రి పదవులు, ఒక కేబినెట్ పదవి డిమాండ్ చేస్తుంది. లీగ్ ప్రధాన కార్యదర్శి పికె కున్హాలికుట్టికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కూడా ఆ పార్టీ పట్టుబడుతోంది. ఆ పార్టీ నుండి 22 మంది ఎమ్యెల్యేలు ఎన్నికయ్యారు.
మరోవంక, ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో, విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తమిళనాడు విభాగం నిర్ణయించింది. తమిళనాడులో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు, నటుడిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌కు ఈ జాతీయ పార్టీ అండగా నిలవనుంది.
అయితే, తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మార్కు 118 సీట్లు కాగా, విజయ్ పార్టీకి ఇంకా ఐదు సీట్ల కొరత ఉంది. టీవీకే 108 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 5 సీట్లను సాధించింది. అంతకుముందు, టీవీకేకి మద్దతు ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం పార్టీ రాష్ట్ర విభాగం పరిధిలో ఉంటుందని, తుది నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ కాంగ్రెస్ మద్దతు కోరుతూ తమను సంప్రదించారని కూడా ఆయన తెలిపారు. ఈ విషయంపై చర్చించేందుకు మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, తమిళనాడు వ్యవహారాల ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్ తదితరులు హాజరయ్యారు.
“ఈ రోజు మేము తమిళనాడు రాజకీయ పరిస్థితులపై, ముఖ్యంగా ఎన్నికల అనంతర పరిణామాలపై చర్చించడానికి ఒక సమావేశం నిర్వహించాము. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే అధ్యక్షుడు విజయ్, కాంగ్రెస్ పార్టీ మద్దతును కోరారు,” అని వేణుగోపాల్ తెలిపారు.

More Stories
జలంధర్, అమృత్సర్ సైనిక కేంద్రాల వద్ద ప్రేలుళ్ళు!
కేరళ ఓటమితో దేశంలో అస్థిత్వ సంక్షోభంలో ‘లెఫ్ట్’!
బెంగాల్ హిందువుల కష్టాలు గట్టెక్కినట్లేనా? అరాచకాలు ఆగిపోయేనా?