భారత ప్రభుత్వం రైల్వే రంగంలో కీలక పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుడుతూ “దక్షిణ తీర రైల్వే” (సౌత్ కోస్ట్ రైల్వే) అనే కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. రైల్వే చట్టం, 1989 కింద అధికారిక గెజిట్ ద్వారా ప్రకటించిన ఈ నిర్ణయం 2026 జూన్ 1 నుంచి అమల్లోకి రానుండడం సంతోషకరమని పేర్కొన్నారు.
ఈ జోన్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌లలోని కొన్ని డివిజన్‌లను పునర్వ్యవస్థీకరించి ఈ కొత్త జోన్‌ను రూపొందించడం సమర్థవంతమైన పరిపాలనకు దోహదం చేస్తుందని మాధవ్ తెలిపారు.
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్‌లను కొత్త జోన్‌లో చేర్చడం, అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్తేరు డివిజన్‌ను విభజించి విశాఖపట్నం డివిజన్‌గా మార్పు చేసి విలీనం చేయడం కీలక నిర్ణయాలుగా ఆయన అభివర్ణించారు. వాల్తేరు డివిజన్‌ను విభజించి ఒక భాగాన్ని “రాయగడ డివిజన్”గా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కొనసాగిస్తూ, మిగిలిన భాగాన్ని విశాఖపట్నం డివిజన్” గా మార్చి దక్షిణ తీర రైల్వేలో చేర్చడం ద్వారా నిర్వహణలో స్పష్టత, సమన్వయం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
రాయగడ డివిజన్ పరిధిలో కొరాపుట్–సింగపూర్ రోడ్, కొత్తవలస–కిరండుల్, కునేరు–థేరు వాలి, గుణుపూర్–పారలాఖేముండి వంటి మార్గాలు చేర్చడం, విశాఖపట్నం డివిజన్ పరిధిలో ఇచ్చాపురం నుంచి దువ్వాడ వరకు విస్తరించే ప్రధాన మార్గంతో పాటు అనుబంధ రైల్వే మార్గాలు ఉండడం ద్వారా రవాణా సదుపాయాలు మరింత విస్తరించనున్నాయని మాధవ్ చెప్పారు.
ఖుర్దా రోడ్ డివిజన్ పరిధిలోని పలాసా–ఇచ్చాపురం మార్గాన్ని విశాఖపట్నం డివిజన్‌కు బదిలీ చేయడం వంటి చర్యలు ఆపరేషన్ల సమన్వయానికి తోడ్పడతాయని ఆయన చెప్పారు. గుంటకల్, గుంటూరు, విజయవాడ, సికింద్రాబాద్ డివిజన్‌ల మధ్య మార్గాల పునర్విభజనతో రైల్వే సరిహద్దులు కొత్తగా నిర్వచించబడతాయని తెలిపారు. ఈ పునర్వ్యవస్థీకరణతో రైల్వే పరిపాలనలో సమర్థత పెరగడంతో పాటు సేవల వేగం, నాణ్యత మెరుగుపడుతుందని మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని అభివృద్ధి అవకాశాలు లభించి, విశాఖపట్నం ఒక ప్రధాన రైల్వే హబ్‌గా ఎదిగే దిశగా ఈ నిర్ణయం దోహదం చేస్తుందని అభిలాష వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైల్వే రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు.

More Stories
జూన్ 1 నుండి “దక్షిణ తీర రైల్వే”
ప్రజాప్రతినిధులు రేషన్ డీలర్లుగా ఉండరాదు!
దారుణంగా పడిపోయిన మామిడి పండ్ల ధరలు