తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసిన వేళ తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పునకు తాను తలవంచుతున్నానని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది పలికాయని చెబుతూ దశాబ్దాలుగా వేళ్లూనుకున్న కొన్ని పద్ధతులకు ఈ ఎన్నికలతో ముగింపు పడిందని ఆయన చెప్పారు.
తమిళనాడు ఓటర్లు ఈసారి ఓటుతోనే తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వినిపించారని అన్నామలై కొనియాడారు. ప్రధానంగా రెండు అంశాలపై ప్రజలు తిరుగులేని స్పందన ఇచ్చారని ఆయన వివరించారు. ముఖ్యంగా డబ్బుతో ఓట్లను కొనవచ్చనే రాజకీయ పార్టీల అహంకారానికి ప్రజలు చెక్ పెట్టారని స్పష్టం చేశారు. అంతేకాకుండా దశాబ్దాల తరబడి కొనసాగుతున్న కుటుంబ పాలనకు, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు గళమెత్తారని అన్నామలై తెలిపారు.
రాజకీయాల్లో ఒక తరంలో వస్తున్న ఈ పెను మార్పు రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరు ఈ మార్పునకు కారకులైనా వారు తమిళనాడు సమాజానికి పెద్ద మేలు చేసినట్లేనని ఆయన కొనియాడారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి ఊహించని రీతిలో అద్భుత ప్రదర్శన కనబరిచిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని అన్నామలై ప్రత్యేకంగా అభినందించారు.
విజయ్ సాధించిన ఈ విజయం రాజకీయాల్లో కొత్త ఉత్తేజాన్ని నింపిందని, ప్రజల కోసం అతను అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిన అధికార డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌కు, అలాగే నామ్ తమిళర్ కట్చి నేత సీమన్‌కు అన్నామలై తన సానుభూతిని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమే అని పేర్కొంటూ ఓటమిని గౌరవప్రదంగా స్వీకరించాలని ఆయన సందేశాన్ని ఇచ్చారు.
పోరాడి ఓడిపోయిన ఎన్డీయే అభ్యర్థులకు అన్నామలై ధైర్యం చెప్పారు. క్షేత్రస్థాయిలో అభ్యర్థులు చేసిన పోరాటాన్ని అభినందిస్తూ గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు పగలు రేయి కష్టపడి పని చేశారని చెబుతూ వారి కృషి ఎప్పటికీ వృథా పోదని భరోసా ఇచ్చారు. “మంచి రోజులు త్వరలోనే రాబోతున్నాయి.. మన పోరాటాన్ని ఇలాగే కొనసాగిద్దాం” అంటూ కార్యకర్తల్లో ఉత్సాహంనింపారు.

More Stories
గవర్నర్ ను కలిసిన విజయ్ …. రేపే ప్రమాణం!
జలంధర్, అమృత్సర్ సైనిక కేంద్రాల వద్ద ప్రేలుళ్ళు!
కేరళంలో ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ లో పోటా పోటీ!