మావోయిస్టుల డంప్‌ తీస్తుండగా ఐఈడీలు పేలి నలుగురు మృతి

మావోయిస్టుల డంప్‌ తీస్తుండగా ఐఈడీలు పేలి నలుగురు మృతి
మావోయిస్టులు భూమిలో పెట్టిన డంప్‌ను వెలికి తీస్తుండగా అందులో ఉన్న ఐఈడీలు పేలి నలుగురు డీఆర్‌జీ జవాన్లు మృతి చెందిన ఘటన ఛత్తీస్‌గఢ్‌రాష్ట్రం కాంకేర్‌, నారాయణపూర్‌ జిల్లాల సరిహద్దు అడవుల్లో శనివారం మధ్యాహ్నం జరిగింది. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో కేంద్ర బలగాలు కొద్ది రోజులుగా అడవులను జల్లెడ పడుతూ మావోయిస్టుల డంప్‌లను స్వాధీనం చేసుకుంటున్నాయి.
ఈ క్రమంలో కాంకేర్‌, నారాయణ పూర్‌ జిల్లాల సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల డంప్‌ ఉన్నట్లు బలగాలకు సమాచారం అందింది. దీంతో రెండు జిల్లాల డీఆర్‌జీ బలగాలు కూంబింగ్‌ చేపట్టి శనివారం ఆ డంప్‌ని గుర్తించాయి. అనంతరం అందులో ఉన్న వస్తువులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పక్కనే మరో డంప్‌ ఉండగా అందులోని వస్తువులను బలగాలు బయటకు తీస్తుండగా భారీ పేలుడు సంభవించింది. 
 
ఈ ఘటనలో మొత్తం నలుగురు డీఆర్‌జీ జవాన్లు తీవ్రంగా గాయపడగా, వారిలో డీఆర్‌జీ ఇన్‌స్పెక్టర్‌ సుఖ్‌రాం వట్టి, కానిస్టేబుల్‌ కృష్ణ, సంజయ్‌ అక్కడే మృతి చెందారు. మరో జవాన్‌ పరమానంద్‌ కొమ్రాన్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ మీడియాకు తెలిపారు. కాగా గత మార్చి 31 వరకు మావోయిస్టుల వేటలో ఉన్న బలగాలు శనివారం ఆపరేషన్‌ ఐఈడీ ప్రారంభించాయి.
అడవుల్లో ఒక్క మందుపాతర కూడా ఉండకూడదనేది బలగాల లక్ష్యం. ఇందులో భాగంగా లొంగిపోయిన మావోయిస్టుల నుంచి వాటి సమాచారాన్ని తెలుసుకుంటూ వెలికితీసే పనిలో నిమగ్నమవుతున్నాయి. కాగా పేలుడులో చనిపోయిన నలుగురు జవాన్ల మృతదేహాలను కాంకేర్‌ జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. 
బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలు ఇటీవలి నెలల్లో, నిఘా సమాచారం, లొంగిపోయిన మావోయిస్టు కార్యకర్తల నుండి అందిన సమాచారం ఆధారంగా వందలాది ఐఈడీలను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశాయని సుందర్‌రాజ్ పట్టిలింగం తెలిపారు. డీఆర్‌జీ అనేది ఛత్తీస్‌గఢ్‌లో, ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక విభాగం. 
 
మార్చి 31న రాష్ట్ర యంత్రాంగం ఈ ప్రాంతాన్ని వ్యవస్థీకృత సాయుధ మావోయిస్టు కార్యకలాపాలు లేనిదిగా ప్రకటించిన కొన్ని వారాల తర్వాత ఈ ఘటన జరిగిందని, అప్పటి నుండి నమోదైన మొట్టమొదటి ఇటువంటి పేలుడు ఇదేనని అధికారులు పేర్కొన్నారు.