మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు!

మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు!
పశ్చిమబెంగాల్‌ లో ఓట్ల లెక్కింపు వేళ టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓట్ల లెక్కింపు సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రమే ఎంపిక చేసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 13 నాటి ఈసీ సర్క్యులర్‌ తప్పని చెప్పలేమని స్పష్టంచేసింది. 
ఓట్ల లెక్కింపు కోసం కేవలం కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని మాత్రమే నియమిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మమతా బెనర్జీ తొలుత కలకత్తా హైకోర్టుకు వెళ్లారు. అయితే, ఈసీ నిర్ణయంలో ఎలాంటి అక్రమం లేదని హైకోర్టు పేర్కొన్నది. దీన్ని సవాల్‌ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మిశ్రమంగా కౌంటింగ్‌ సిబ్బంది ఉంటారని తమ సర్క్యులర్‌లో స్పష్టంగా పేర్కొన్నట్లు ఈసీ సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. రిటర్నింగ్ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఉంటారని, కౌంటింగ్‌ సిబ్బందిని నియమించే అధికారం ఆయనకు ఉంటుందని తెలిపింది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరుగుతాయన్న టీఎంసీ ఆందోళనలు నిరాధారమని వాదించింది. 

ఆ సర్క్యులర్‌ను తూచా తప్పకుండా అమలుచేస్తామని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. టీఎంసీ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదిస్తూ ఆ సర్క్యులర్ ఏప్రిల్ 13 నాటిదని, అయితే, దాని గురించి తమకు ఏప్రిల్ 29న తెలిసిందని తెలిపారు. ఆ సర్క్యులర్‌లో ఉన్నదిఉన్నట్లుగా అమలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దాంతో జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ స్పందిస్తూ ఆ సర్క్యులర్ అమలు కావాలని ఆశిస్తున్నట్లయితే అసలు కోర్టు ముందుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.

టీఎంసీ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ దీనిపై తదుపరి ఆదేశాలు అక్కర్లేదని చెప్పారు. ఎన్నికల సంఘం నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా లేదని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా, ఎన్నికల సంఘం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది డీ.ఎస్. నాయుడు, రిటర్నింగ్ అధికారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అని, ప్రభుత్వ ఉద్యోగులను ఏ విభాగం నుంచైనా సిబ్బందిని నియమించే అధికారం ఆయనకు ఉంటుందని తెలిపారు.

ఓట్ల లెక్కింపు సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారని చెప్పారు. ప్రతి అభ్యర్థికి వారి స్వంత కౌంటింగ్ ఏజెంట్ కూడా ఉంటారని తెలిపారు. అలాగే, టీఎంసీ ఆందోళనలు నిరాధారమైనవని పేర్కొన్నారు.  మరోవైపు, మమతా దాఖలు చేసిన పిటిషన్​ను కోర్టు తోసిపుచ్చడం మమతా బెనర్జీకి న్యాయపరమైన ఎదురుదెబ్బ అని బీజేపీ సీనియర్​ నాయకుడు అమిత్​ మాల్వీయా పేర్కొన్నారు.