బీజేపీలో చేరిన సందీప్ పాఠక్‌పై పంజాబ్ లో రెండు కేసులు

బీజేపీలో చేరిన సందీప్ పాఠక్‌పై పంజాబ్ లో రెండు కేసులు
* త్వరలో అరెస్ట్ చేసే అవకాశం… విశ్వాస పరీక్ష నెగ్గిన మాన్ ప్రభుత్వం 
 
ఆప్ నుండి గత వారం బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై పంజాబ్ పోలీసులు శనివారం బెయిల్ లేని నేరాల కింద రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఆయనను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  “రాజ్యసభ ఎంపీపై పంజాబ్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. పంజాబ్‌లోని రెండు వేర్వేరు జిల్లాల్లో పాఠక్‌పై ఈ ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి,” అని ఒక అధికారిక వర్గం తెలిపింది.
పాఠక్‌ను ఇప్పుడు ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చని కూడా ఆ వర్గం పేర్కొంది.  పాఠక్, మరో ఆరుగురు రాజ్యసభ ఎంపీలతో కలిసి ఫిరాయించి, ఆ బృందం మొత్తం బీజేపీలో విలీనమైన విషయం గమనార్హం.  2020 వరకు ఐఐటి ఢిల్లీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన పాఠక్ పరిశోధన ప్రధానంగా ఫోటోవోల్టాయిక్ కణాలపై కేంద్రీకృతమై ఉండెడిది. ఢిల్లీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ లో పూర్తిస్థాయి సభ్యుడిగా చేరారు. 
 
ఆయన 2011లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి తన పిహెచ్ డిని పొందారు, ఆపై కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఐఐటి ఢిల్లీలో బోధించారు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండే, నిరాడంబరమైన నాయకుడైన పాఠక్, గత ఐదేళ్లుగా ఆప్ కి తెరవెనుక వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. పంజాబ్‌లో ఆ పార్టీ సాధించిన విజయమే, పార్టీలో పాఠక్ పోషించిన పాత్రను మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చింది.
 
మరోవంక, ఆప్ ప్రభుత్వం శుక్రవారం పంజాబ్ విధానసభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి గెలుపొందింది.  విధానసభ కార్యవిధాన నియమాల ప్రకారం, ఈ తీర్మానం ఆమోదం పొందడంతో, రాబోయే ఆరు నెలల పాటు లేదా సమావేశాలు ముగిసేంత వరకు అధికార పార్టీకి ఎలాంటి అవిశ్వాస తీర్మానం నుండి రక్షణ లభిస్తుంది.  ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఎమ్మెల్యేలు చర్చించి, సభలో ఆమోదించినప్పుడు, 94 మంది ఆప్ ఎమ్మెల్యేలలో 80 మంది సభకు హాజరయ్యారు.
అయితే, స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్‌తో కలిపి, సమావేశానికి 88 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కానీ భోజన విరామం తర్వాత తీర్మానం చర్చకు వచ్చినప్పుడు కొందరు వెళ్లిపోయారు.  ఆప్ చీఫ్ విప్ బల్జిందర్ కౌర్, ఎమ్మెల్యేలందరూ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని విప్ జారీ చేశారు. అయినా హాజరుకాని వారిలో జస్విందర్ సింగ్ రామ్‌దాస్ అత్తారి, దేవిందర్‌జీత్ సింగ్ లడ్డీ ధోస్, మంజిందర్ సింగ్ లాల్‌పురా, కున్వర్ విజయ్ ప్రతాప్ (పార్టీ నుండి సస్పెన్షన్‌లో ఉన్నారు) ఉన్నారు.
కున్వర్ విజయ్ ప్రతాప్ మినహా, మిగిలిన ముగ్గురు సెలవు కోరారని పార్టీ వర్గాలు తెలిపాయి.  ప్రస్తుతం జైలులో ఉన్న లాల్‌జిత్ సింగ్ భుల్లర్, హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా అనే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సభకు గైర్హాజరయ్యారు. మాన్ సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విచ్ఛిన్నమయ్యే అంచున ఉందనే వదంతులను కొట్టిపారవేసారు.
“నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆప్ ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు. వాస్తవానికి, మనం దేశవ్యాప్తంగా మన ఉనికిని పెంచుకుంటున్నాము. గుజరాత్, జమ్మూ కాశ్మీర్, గోవాలలో ఎమ్మెల్యేలు, పంజాబ్‌లో అధికార పార్టీగా, ఢిల్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ, అత్యంత పిన్న వయస్కురాలైన జాతీయ పార్టీగా కొనసాగుతున్నాము” అని గుర్తు చేశారు. 
 
“చీపురు (ఆప్ ఎన్నికల గుర్తు)లోని కొన్ని పుల్లలు రాలవచ్చు, కానీ చీపురు బలంగా ఉంటుంది,” అని ఆయన స్పష్టం చేస్తూ ఈ వదంతులు ప్రతిపక్ష పార్టీల సృష్టేనని చెప్పుకొచ్చారు. “కొన్నిసార్లు ఒక పార్టీ చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెబుతుంది, ఆ తర్వాత మరో పార్టీ ఆప్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెబుతుంది. కానీ ప్రజలు మన పనితీరుతో ఆకట్టుకున్నారు, పార్టీని విడిచిపెట్టరు,” అని ఆయన భరోసా వ్యక్తం చేశారు. 
 
బీజేపీ ప్రేరేపించిన ఫిరాయింపులతో కాంగ్రెస్ పార్టీయే తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు, ఆప్ ఎంపీల ఫిరాయింపులను చూసి “సంతోషిస్తున్న” కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆయన ఎగతాళి చేశారు. తీర్మానాన్ని బలపరిచిన ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా, ఆప్ ఎంపీల ఫిరాయింపులపై కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని అధికార పార్టీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు.  పార్టీ అధ్యక్షుడు అమన్ అరోరా మాట్లాడుతూ, ఆప్ ఎమ్మెల్యేలందరూ అరవింద్ కేజ్రీవాల్, మన్‌లకు ఐక్యంగా మద్దతుగా నిలిచారని తేల్చి చెప్పారు.