మే 1 కార్మిక దినోత్సవం సందర్భంగా పంజాబ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైన క్రమంలో హైడ్రామా చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం సేవించి వచ్చారని ఆరోపించిన ప్రతిపక్ష సభ్యులు ఆయనకు ఆల్కహల్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. సీఎం మద్యం మత్తులో వచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు చేశారు.
దీనికి ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా స్పందిస్తూ ప్రభుత్వ అధినేతపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చి నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ అల్కహాల్ టెస్టులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మిక దినోత్సవం రోజున ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తించడం ‘అత్యంత సిగ్గుచేటు’ అని ప్రతిపక్షం దుయ్యబట్టింది. ప్రజల సమక్షంలోనే ముఖ్యమంత్రి డోప్ టెస్ట్ చేయించుకోవాలని కోరింది.
అయితే, ఈ డిమాండ్‌ను స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ తిరస్కరించారు. సభ జరుగుతుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా మొబైల్ ఫోన్ చూస్తున్నారని సీఎం మాన్ ఆరోపించడంతో వివాదం మొదలైంది. దీనికి ఖైరా అంతకుముందు జరిగిన ఒక సెషన్‌లో విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న మాన్ భార్యను ప్రస్తావిస్తూ స్పందించారు.
దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోగా సీఎం తడబడుతూ ‘‘ఆమె తన తప్పును సరిదిద్దుకున్నారు. సభలో అమె సభ్యురాలు కాదు. నువ్వు నా కుమార్తెను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నావు. ఈయన పిచ్చివాగుడు వాగుతున్నాడు’’ అంటూ నోరుజారారు. ఉద్రిక్తతలు పెరగడంతో ముఖ్యమంత్రి మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చారని ఖైరా ఆరోపించడంతో సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది.
ప్రతిపక్షాల నిరసనలపై భగవంత్ మాన్ స్పందిస్తూ కార్మిక దినోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశమని, దయచేసి సభ్యులు సభామర్యాదలు పాటించాలని కోరారు. గందరగోళం మధ్య సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఆ తర్వాత, బీజేపీ, అకాలీ దళ్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
దీనిపై మాన్ మాట్లాడుతూ ‘‘ మే డే సందర్భంగా సమావేశాలు సానుకూల వాతావరణంతో ప్రారంభమయ్యాయి, కానీ కాంగ్రెస్ ఎప్పుడూ వాకౌట్ చేయడానికి సాకులు వెతుకుతుంది’’ ఎద్దేవా చేశారు. రాఘవ్ చద్దాతో పాటు పంజాబ్‌కు చెందిన ఆరుగురు సహా ఆ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసి బీజేపీలో చేరిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.
దీనిపై ఆప్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకుంది. ఈ సమావేశానికి ఆప్‌కు చెందిన 117 మంది ఎమ్మెల్యేలు హాజరు కాగా, కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్ సభ్యులు గైర్హాజరయ్యారు.

More Stories
అలర్ట్ సిస్టమ్ తో దేశవ్యాప్తంగా మోగిన మొబైల్ ఫోన్లు!
మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు!
బీజేపీలో చేరిన సందీప్ పాఠక్‌పై పంజాబ్ లో రెండు కేసులు