యూరో ఎగ్జిమ్ బ్యాంక్ జారీ చేసిన గ్యారంటీలు నకిలీవని, ఆ సంస్థ ఆర్థిక మోసాలకు పాల్పడుతోందని వెలిచేటి రవి ప్రకాష్ ఆధీనంలోని ఆర్ టీవీ కథనాలు ప్రసారం చేయటాన్ని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ తొమ్మిదో అదనపు చీఫ్ జడ్జి కె. మురళీమోహన్ తప్పు పట్టారు. జర్నలిజం స్వేచ్ఛ పేరుతో అసత్య కథనాలు సరికాదని కోర్టు స్పష్టం చేసింది. ఆర్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు సంబంధించి ఏ ఒక్క ఆధారాన్ని కోర్టుకు సమర్పించలేదని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు.
యూరో ఎగ్జిమ్ బ్యాంక్‌పై “మెగా స్కామ్” అంటూ ఆర్ టీవీ 2024 జులై, ఆగస్టు నెలల్లో ప్రసారం చేసిన నిరాధార, అపకీర్తికర ప్రసారాలపై తాత్కాలిక నిషేధాజ్ఞ జారీ చేసింది. బ్యాంక్‌పై ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలను కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ జారీ చేసిన గ్యారంటీలు “నకిలీవి”, బ్యాంక్ “భారీ ఆర్థిక మోసం”లో పాల్గొంటోంది అని ఆర్ టీవీ వార్తా కథనాలు ప్రసారం చేసింది.
అలాగే ఆర్‌బీఐ, ఫెమా నిబంధనలను ఉల్లంఘిస్తోంది అంటూ ఆ కథనాల్లో ఆరోపణలు ప్రసారం చేసింది. ఈ కథనాలపై బ్యాంక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ సందర్భంగా కోర్టు ప్రత్యర్థుల వాదనలను సమీక్షించి, వారు చేసిన ఆరోపణలకు సంబంధించి ఎటువంటి పత్రాధారాలు, ధృవీకరించదగిన సమాచారం, విశ్వసనీయ మూలాలను సమర్పించలేదని గమనించింది.
బ్యాంక్ గ్యారంటీలు మోసపూరితమైనవని నిరూపించడానికి ఎటువంటి ప్రాథమిక ఆధారాలు ఆర్ టీవీ, దాని యజమాని సమర్పించలేదు. బ్యాంక్‌పై చేసిన తీవ్రమైన ఆరోపణలకు మద్దతుగా ప్రత్యర్థులు “ఒక చిట్టి కాగితం కూడా” సమర్పించలేదు. హవాలా లావాదేవీలు, అక్రమ గ్యారంటీలు, ఆర్‌బీఐ, ఫెమా ఉల్లంఘనలపై ఎటువంటి అధికారిక చర్యలు లేదా క్రిమినల్ కేసులు నమోదైనట్టు ఆధారాలు లేవు.
నిర్ధారణ లేని ఆరోపణల వల్ల బ్యాంక్ ప్రతిష్ఠకు, వ్యాపార ప్రయోజనాలకు తిరుగులేని నష్టం కలగవచ్చని కోర్టు అభిప్రాయపడింది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నికర విలువ కేవలం రూ. 8 కోట్లు మాత్రమేనని ఆర్ టీవీ తన కథనంలో పేర్కొంది. అయితే ఈ వాదనకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదని కోర్టు స్పష్టం చేసింది. ఆర్ టీవీ కథనం తప్పు అని నిరూపించేలా బ్యాంక్ తన అధికారిక ఆర్థిక పత్రాలను సమర్పించి, 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ ప్రకారం తమ నికర విలువ రూ. 1,900 కోట్లకు పైగా ఉందని కోర్టుకు తెలిపింది.
ఈ సందర్భంగా యూరో ఎగ్జిమ్ బ్యాంక్‌పై ధృవీకరణ లేని ఆరోపణలు ప్రసారం చేయరాదని కోర్టు స్పష్టం చేసింది. అపకీర్తికర లేదా అవమానకర శీర్షికలతో ప్రసారాలు చేయరాదని ఉత్తర్వులో పేర్కొంది. భవిష్యత్తులో ఈ అంశంపై ఏదైనా ప్రసారం/ప్రచురణ జరిగితే, అది ఓ.ఎస్.నం. 413/2024 కేసులో విచారణలో ఉందని స్పష్టంగా ఆడియో, వీడియో రూపంలో తెలియజేయాలని పేర్కొంది.
అదే విధంగా జర్నలిజం స్వేచ్ఛ రాజ్యాంగబద్ధ హక్కే అయినప్పటికీ, అది బాధ్యతాయుతంగా, వాస్తవాధారాలతో ఉండాలి. నిరాధార ఆరోపణలు లేదా సంచలనాత్మక ప్రసారాలు స్వేచ్ఛ పేరుతో సమర్థించబడవని కోర్టు పేర్కొంది. ఇదే వ్యవహారానికి సంబంధించి 2025 మార్చిలో బొంబాయి హైకోర్టు కూడా రవి ప్రకాష్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిఐఎల్) కొట్టివేసింది. వాస్తవాలను దాచిపెట్టడం, సరైన ఉద్దేశం లేకపోవడం కారణాలుగా కోర్టు పేర్కొంది.

More Stories
యోగా ద్వారా విశ్వగురుగా భారత్.. అదే మోదీ లక్ష్యం
అలర్ట్ సిస్టమ్ తో దేశవ్యాప్తంగా మోగిన మొబైల్ ఫోన్లు!
బీజేపీలో చేరిన సందీప్ పాఠక్‌పై పంజాబ్ లో రెండు కేసులు