తెలంగాణలో మోదీ పర్యటనలో రూ.7,823 కోట్ల అభివృద్ధి పనులు

తెలంగాణలో మోదీ పర్యటనలో రూ.7,823 కోట్ల అభివృద్ధి పనులు
ప్రధాని నరేంద్ర మోదీ మే 10న తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా రూ.7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.  ఈ ప్రాజెక్టులు ప్రధానంగా మౌలిక సదుపాయాలు, రవాణా మరియు పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా ఉన్నాయని చెప్పారు. సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. 
 
‘‘హైదరాబాద్‌లో సుమారు 1.6 లక్షల కిలోలీటర్ల సామర్థ్యంతో  పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి టెర్మినల్‌ను రూ 611 కోట్ల వ్యయంతో మోదీ  ప్రారంభించనున్నారు. మహబూబ్‌నగర్‌లో రూ.3,175 కోట్ల విలువైన జాతీయ రహదారి పనులకు వర్చువల్‌గా శ్రీకారం చుట్టనున్నారు. హఫీజ్‌పేట, జోగులాంబ రైల్వేస్టేషన్లు, కాజీపేట-విజయవాడ మధ్య మూడు రైల్వే లైన్‌ను ప్రారంభించనున్నారు’’ అని కిషన్ రెడ్డి తెలిపారు. 
 

రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, హైదరాబాద్- యాదగిరిగుట్ట ఎంఎంటిఎస్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని, 2030 నాటికి రూ.9 లక్షల కోట్ల విలువైన టెక్స్‌టైల్ ఉత్పత్తులున ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా నరేంద్ర మోదీ మే నెల 10వ తేదీ, ఆదివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణకు రానున్నట్లు ఆయన చెప్పారు.

కాగా, తార్నాక ప్రాంతంలో సుమారు రూ.400 కోట్లతో నేషనల్ సైన్స్ సెంటర్ నిర్మాణం కొనసాగుతోందని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్లను పరిశీలించి ఆమోదించి టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగానికి సంబంధించిన డిపిఆర్ పనులు కొనసాగుతున్నాయని, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.  దేశవ్యాప్తంగా 12 గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ జోన్లు ఏర్పాటు చేస్తుండగా, అందులో తెలంగాణలోని జహీరాబాద్‌కు ఒకటి కేటాయించామని గుర్తు చేశారు.