ఆలయ ప్రవేశాన్ని నాస్తికులు హక్కుగా ఎలా కోరగలరు?

ఆలయ ప్రవేశాన్ని నాస్తికులు హక్కుగా ఎలా కోరగలరు?
ఉత్తర భారతదేశానికి చెందిన నాస్తికుడు దక్షిణాదిన ఉన్న శబరిమల ఆలయంలోకి ప్రవేశించే హక్కును ఎలా కోరగలరు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆలయ ప్రవేశ హక్కుకు సంబంధించిన అంశాన్ని నిర్ణయించేటప్పుడు ఆ హక్కును కోరుతున్నది భక్తుడా? లేక నాస్తికుడా? అనే విషయాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. 
శబరిమలతో సహా మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా 9మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యాలు చేసింది. ఈ పిటిషన్లపై బుధవారం నాటి విచారణలో భాగంగా 2018నాటి తీర్పును సమర్థిస్తున్న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళల తరఫున సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ వాదనలు వినిపించారు. 
 
ఈ సందర్భంగా జస్టిస్‌ నాగరత్న.. ‘ఆలయ ప్రవేశ హక్కును ఎవరు కోరుతున్నారు? ఒక భక్తురాలా లేక ఎవరి ప్రోద్బలంతోనో ఒక నాస్తికురాలా? ఈ ఆలయంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఉత్తర భారతదేశంలో ఎక్కడో ఉండి ఆలయ ప్రవేశాన్ని కోరుతున్నారు. దీన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.

 

పిటిషనర్లలో ఒకరు షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళ అని, ఆమెను ఆలయ సందర్శన నుంచి నిరోధించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 (అంటరానితనం నిర్మూలన)ను ఉల్లంఘించడమే అవుతుందని జైసింగ్ వాదించారు. కులరహిత హిందువులు శబరిమలలోకి ప్రవేశించవచ్చని, కానీ మహిళలు ప్రవేశించలేరని చెబుతున్నారని వాదించారు. కానీ, ఆర్టికల్ 17 కారణంగా కులంతో సంబంధం లేకుండా పురుషులందరూ ప్రవేశించవచ్చని ఆమె కోర్టుకు చెప్పారు.

 
పిటిషన్​దారులు షెడ్యూల్డ్ కులానికి చెందినది కావడం వల్ల నిరోధించలేదని, కానీ ఆమె 10 నుంచి 50 సంవత్సరాల వయస్సు వర్గానికి చెందినది కావడం వల్లే అడ్డుకున్నారని విన్నవించారు. ఆలయంలోకి ప్రవేశించి ఆరాధించే హక్కు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) ప్రకారం ఒక ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. 2018 నాటి తీర్పు వెలువడిన తర్వాతే ఇద్దరు మహిళలు ఆలయానికి వెళ్లారని ఆమె గుర్తు చేశారు. 

ఈ క్రమంలోనే స్పందించిన న్యాయమూర్తి జస్టిస్​ బీవీ నాగరత్న “ఈ హక్కును ఎవరు కోరుతున్నారు? ఒక భక్తురాలు ఈ హక్కును కోరుతున్నారా? లేక ఎవరి ప్రేరణతోనో ఒక భక్తురాలు కాని వ్యక్తి దీనిని కోరుతున్నారా?” అని ప్రశ్నించారు. “ఈ ఆలయంతో ఎటువంటి సంబంధం లేని ఒక వ్యక్తి ఉత్తర భారతదేశంలో ఎక్కడో ఉన్నారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో ఉంది. ఇలాంటి సమయంలో ప్రవేశ హక్కును కోరడం అనే అంశాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది” అని ఆమె తెలిపారు.