అమెరికా అధ్యక్షులుగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ మున్నెన్నడూ లేని విధంగా ప్రజాదరణ కోల్పోయారు. నాలుగు రోజుల పాటు రాయిటర్స్/ఇప్సోస్ నిర్వహించిన తాజా పోల్‌లో కేవలం 34 శాతం మంది మాత్రమే ట్రంప్ పనితీరును సమర్థించారు. ఈ సర్వేకు ముందు ఈ నెల 15-20 తేదీల మధ్య జరిగిన మరో పోల్‌లో ఆయనకు 36 శాతం మంది మద్దతు తెలిపారు. గత జనవరిలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆయనను 47 శాతం మంది సమర్థించడం గమనార్హం.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ దళాలు ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత ట్రంప్ రేటింగ్ మరింత దిగజారింది. యుద్ధం కారణంగా గ్యాసోలిన్ ధరలు బాగా పెరిగాయి. ప్రజల జీవన వ్యయానికి సంబంధించి ట్రంప్ పనితీరును కేవలం 22 శాతం మంది మాత్రమే సమర్థించారు. రాయిటర్స్/ఇప్సోస్ సర్వేకు ముందు ఈ రేటింగ్ పాతిక శాతంగా ఉంది. ఇరాన్‌తో అమెరికా ఘర్షణను కేవలం 34 శాతం మంది అమెరికన్లు మాత్రమే ఆమోదిస్తున్నారని, ఇది ఏప్రిల్ మధ్యలో 36 శాతం, మార్చి మధ్యలో 38 శాతం నుండి తగ్గిందని పోల్ వెల్లడించింది.
జీవన వ్యయంపై అడిగిన ప్రశ్నకు రిపబ్లికన్లు సైతం ట్రంప్ పనితీరుపై పెదవి విరిచారు. 41 శాతం మంది ఆయనను వ్యతిరేకించారు. ట్రంప్ హయాంలో జీవన వ్యయం పెరిగిందని తటస్థులలో 71 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దళాలు యుద్ధం ప్రారంభించిన తర్వాత గ్యాసోలిన్ ధరలు ఏకంగా 40 శాతం పెరిగి గ్యాలన్‌కు 4.18డాలర్లకు చేరాయి. ధరల పెరుగుదల అమెరికా కుటుంబాలపై పెను భారం మోపింది.
నవంబరులో జరిగే మధ్యంతర ఎన్నికలలో అమెరికా ప్రతినిధి సభపై పట్టు కోల్పోతామేమోనని రిపబ్లికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిపబ్లికన్లలో మాత్రం ఇప్పటికే ట్రంప్‌ను 78 శాతం మంది వెనకేసుకొస్తున్నారు. అయితే జీవనవ్యయాన్ని అదుపు చేయడంలో ట్రంప్ విఫలమయ్యారని 41 శాతం మంది రిపబ్లికన్లు అభిప్రాయపడడం గమనార్హం. మధ్యంతర ఎన్నికలలో నిర్ణయాత్మక పాత్ర పోషించే స్వతంత్ర ఓటర్లు ఇప్పుడు డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
గతంలో 20 శాతం మంది తటస్థులు డెమొక్రాట్లను సమర్థిస్తే తాజాగా అది 34 శాతానికి పెరిగింది. ప్రతి నలుగురు స్వతంత్ర ఓటర్లలో ఒకరు ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. ధరలను అదుపులోకి తెస్తానన్న హామీతో 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు ట్రంప్‌ను సమర్థిస్తున్న వారి సంఖ్య కేవలం 27 శాతం మాత్రమే.
2017-2021 మధ్య ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆయన రేటింగ్ ఇంత దారుణంగా పడిపోయిన సందర్భం లేదు. అత్యంత బలహీనమైన బైడెన్ ఆర్థిక రేటింగ్ కంటే ఇది తక్కువగా ఉంది. అనేక సంవత్సరాలుగా అధిక ద్రవ్యోల్బణం తన పూర్వగామి, డెమొక్రాట్ జో బైడెన్‌ను విసిగించిన నేపథ్యంలో, ధరలను తగ్గిస్తానన్న వాగ్దానాలతో ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ ఆమోద రేటింగ్ 27 శాతంగా ఉంది. ఇది ఆయన 2017-2021 పరిపాలన కాలంలోని ఏ రేటింగ్ కన్నా చాలా తక్కువగా ఉంది. అలాగే బైడెన్ అత్యంత బలహీనమైన ఆర్థిక రేటింగ్ కన్నా కూడా తక్కువ.

More Stories
నైతిక సాంకేతికత కోసం దత్తాత్రేయ హోసబాలే పిలుపు
ప్రపంచ సార్వభౌముడిగా డొనాల్డ్ ట్రంప్?
బెంగాల్ లో బీజేపీకి మెజారిటీ, టీఎంసీ పతనం .. పలు ఎగ్జిట్ పోల్స్