గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారవేస్తూ ఎక్కడా అటువంటి కొరత లేదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంతకు ముందు కూడా ఎల్పీజీ కొరత ఉందని ఇలాంటి ప్రచారం జరిగిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో సాధారణంగా రోజుకు సుమారు 6400 కిలోలీటర్ల పెట్రోల్ సరఫరా జరుగుతుందని, కానీ ప్రస్తుతం అది 10,300 కిలోలీటర్లకు పెంచామని ఆయన తెలిపారు.
హైదరాబాద్ నగరంలో సాధారణంగా 3200 కిలోలీటర్లు సరఫరా ఉండగా, ఇప్పుడు దాన్ని 6400 కిలోలీటర్లకు పెంచామని చెప్పారు. ఇదే విధంగా డీజిల్ విషయంలో సాధారణంగా 8000 కిలోలీటర్లు ఉండే సరఫరాను ప్రస్తుతం 15,500 కిలోలీటర్లకు, కొన్ని రోజుల్లో 19,300 కిలోలీటర్ల వరకు పెంచామని వివరించారు. ఇంత భారీగా సరఫరా పెంచుతున్నప్పటికీ కొరత ఉందని చెప్పడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
మొత్తం 4325 పెట్రోల్ పంపుల్లో ఉదయం వరకు 106 పంపుల్లో మాత్రమే తాత్కాలికంగా స్టాక్ సమస్య కనిపించిందని, అది కూడా సరఫరా ఆలస్యం, లేదా ముందస్తు చెల్లింపులు చేయకపోవడం వంటి కారణాల వల్లే అని పేర్కొంటూ ప్రస్తుతం ఆ సమస్యను కూడా పరిష్కరిస్తున్నామని భరోసా ఇచ్చారు. మన దేశం పెట్రోలియం ఉత్పత్తుల్లో సుమారు 88 శాతం ఇతర దేశాలపై ఆధారపడి ఉందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని భౌగోళిక పరిస్థితుల వల్ల క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, భారత ప్రభుత్వం అనేక దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటూ దేశంలో ఎక్కడా కొరత రాకుండా చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ద్వారా ధరలు పెరుగుతాయని తప్పుడు ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో భయం నెలకొందని ఆయన చెప్పారు.
దాని కారణంగా అవసరానికి మించి నిల్వ చేసుకోవడం వల్లనా పరిస్థితిని మరింత కష్టతరం చేస్తోందని విచారం వ్యక్తం చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. అయితే, ప్రజలు అవసరమైనంత మాత్రమే కొనుగోలు చేయాలని, ఇళ్లలో పెట్రోల్ నిల్వ చేసుకుంటే ప్రమాదకరం అని, ముఖ్యంగా వేసవిలో అగ్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని కిషన్ రెడ్డి హెచ్చరించారు.
బల్క్ వినియోగదారులు (ఇండస్ట్రీస్, కంపెనీలు) రిటైల్ పెట్రోల్ బంకుల వద్ద కొనుగోలు చేయకుండా, నేరుగా ఆయిల్ కంపెనీలకు ఇండెంట్ ఇవ్వాలని ఆయన సూచించారు. 24 గంటల్లో సరఫరా చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని హామీ ఇచ్చారు. అలాగే ఆటో ఎల్పీజీ విషయంలో కూడా ప్రభుత్వ రంగ కంపెనీలు సరిపడా సరఫరా చేస్తున్నాయని, కొన్ని ప్రైవేట్ సరఫరాల్లో మాత్రమే తాత్కాలిక సమస్యలు ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు.
ఏదైనా సమస్య ఉంటే అధికారిక హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

More Stories
నైతిక సాంకేతికత కోసం దత్తాత్రేయ హోసబాలే పిలుపు
ప్రపంచ సార్వభౌముడిగా డొనాల్డ్ ట్రంప్?
మున్నెన్నడూ లేని విధంగా ప్రజాదరణ కోల్పోతున్న ట్రంప్