విశాఖలో ‘గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌’కు శంకుస్థాపన

విశాఖలో ‘గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌’కు శంకుస్థాపన

విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌, ఐటీ మంత్రి లోకేశ్‌, కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, శ్రీనివాసవర్మ మంగళవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో గూగుల్‌ క్లౌడ్ వైస్‌ ప్రెసిడెంట్ వికాస్ కోలీ, అదానీ పోర్ట్స్‌ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ పాల్గొన్నారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటుతో భారత్‌కు ఆంధ్రప్రదేశ్‌ అంతర్జాతీయ డేటా గేట్‌వేగా నిలుస్తుందని చెప్పారు. డేటా సెంటర్‌ శంకుస్థాపన కార్యక్రమమే కాదని ఏపీ డిజిటల్‌ భవిష్యత్తుకు పునాదిగా అభివర్ణించారు. ప్రభుత్వం తరపున వేగంగా అన్ని అనుమతులు ఇస్తామన్న చంద్రబాబు 2028 సెప్టెంబర్‌ 28కి డేటా సెంటర్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. అలాగే ప్రధాని మోదీని ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు.

” అమరావతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లకు బుల్లెట్‌ ట్రైన్‌ ఎప్పుడని అడిగా. ఏడెనిమిదేళ్లలో నాలుగు నగరాలకు బుల్లెట్‌ ట్రైన్‌లు వస్తాయని అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. జులైలో భోగాపురం ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేస్తాం. భవిష్యత్తులో అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లాగా మారుతుంది. జూన్‌ 1న దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రారంభమవుతుందని అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు” అని తెలిపారు.

టెక్నాలజీలో ఏపీ సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుందని పేర్కొంటూ ఒక గిగావాట్‌ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్‌ పనిచేస్తుందని, భారతదేశానికి ఏపీ, అంతర్జాతీయ డేటా గేట్‌వేగా నిలుస్తుందని చెప్పారు. కేవలం శంకుస్థాపనే కాదు, ఏపీ డిజిటల్‌ భవిష్యత్తుకు పునాదులు వేస్తున్న రోజని అంటూ సెర్చ్‌ ఇంజిన్‌గా మొదలైన గూగుల్‌, ఇప్పుడు భారత్‌ గ్రోత్‌ ఇంజిన్‌గా మారబోతోందని చంద్రబాబు స్పష్టం చేశారు.

“ఏపీలో వ్యాపార నిర్వహణ ఖర్చు, మిగిలిన నగరాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. పెట్టుబడులు, ఒప్పందాలే కాదు, ప్రారంభంలోనూ ముందున్నాం. దేశంలో వచ్చిన పెట్టబడుల్లో 25.3 శాతం ఏపీకి వచ్చాయి. ఒక్కసారి ఏపీతో ఒప్పందం జరిగితే ఆ ప్రాజెక్టు సక్సెస్‌ చేసి తీరుతాం.” అని చంద్రబాబు తెలిపారు. కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం ఏఐ పట్నం కాబోతుందని తెలిపారు. చాలా తక్కువ సమయంలో విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా హబ్‌కు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని చెబుతూ డేటా సెంటర్ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానిస్తామని చెప్పారు.