దావూద్ అనుచరుడు, డ్రగ్ కింగ్‌పిన్ సలీం డోలా భారత్‌కు అప్పగింత

దావూద్ అనుచరుడు, డ్రగ్ కింగ్‌పిన్ సలీం డోలా భారత్‌కు అప్పగింత

తుర్కీయేలోని ఇస్తాంబుల్‌లో అరెస్టైన  ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం  అనుచరుడు, డ్రగ్ కింగ్‌పిన్ సలీం డోలాను ప్రత్యేక విమానంలో దిల్లీకి తీసుకొచ్చారు భారత అధికారులు. దావూద్ డ్రగ్ సామ్రాజ్యం వెనుక కీలక వ్యక్తిగా ఉన్న సలీం డోలా ప్రస్తుతం నిఘా సంస్థల విచారణను ఎదుర్కొనున్నాడు.  సలీం డోలాను అధికారులు ముంబయి పోలీసులకు అప్పగించనున్నారు. ఆ తర్వాత అతడ్ని దర్యాప్తు సంస్థలు అతడిని విచారించనున్నాయి.

తుర్కియే భద్రతా సంస్థలు, ఇస్తాంబుల్ పోలీసులు సంయుక్తంగా ఓ భారీ ఆపరేషన్‌ జరిపి భారత్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ స్మగ్లర్ సలీం డోలా ఏప్రిల్ 25న అరెస్ట్ చేశారు.  మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న డోలా బేలిక్‌దుజు జిల్లాలోని ఒక నివాసంలో దాక్కుని ఉన్నట్లు ఇస్తాంబుల్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో విస్తృతమైన సాంకేతిక, భౌతిక నిఘా ద్వారా తుర్కియే భద్రతా సంస్థలు, పోలీసులు అనుమానితుడి కచ్చితమైన ఆచూకీని నిర్ధారించుకున్నారు. 

అనంతరం ఆపరేషన్ నిర్వహించి సలీం డోలాను విజయవంతంగా పట్టుకున్నారు. కాగా, ఇప్పటికే సలీం డోలాపై భారత్ ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ముంబయిలోని కుర్లా ప్రాంతంలో ఇటీవలే సలీం అలీ అనుచరులు పోలీసులకు పట్టుబడ్డారు. వారు పోలీసుల ఎదుట సలీం డోలా ఆదేశాల మేరకే తాము పనిచేస్తున్నట్లు ఒప్పుకున్నారు. 

ఈ క్రమంలో సంబంధిత దాడులలో అధికారులు 126కిలోల 141 గ్రాముల మెఫెడ్రోన్‌, రూ.25,22,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సలీం డోలాపై భారత్ ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. డోలాపై 1985 నాటి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద పలు అభియోగాలను ఎదుర్కొంటున్నారని అందులో స్పష్టం చేసింది. 

దావూద్‌ ఇబ్రహీంకు చెందిన డి-కంపెనీ విదేశాల్లో నిర్వహించే డ్రగ్‌ ఆపరేషన్లకు డోలానే ప్రధాన సూత్రధారి. ఇతడి కనుసన్నల్లో ఏడాదికి రూ.5 వేల కోట్ల డ్రగ్స్‌ వ్యాపారం సాగుతోందనే అంచనాలున్నాయి. కొన్ని నెలల క్రితం డోలా నెట్‌వర్క్‌కు చెందిన సలీమ్‌ సోహైల్‌ షేక్‌ అనే డీలర్‌ దుబాయ్‌లో అరెస్టయ్యాడు. అతడిని భారత్‌కు అప్పగించిన తర్వాత ఈ డ్రగ్‌ నెట్‌వర్క్‌ తీగ లాగితే గతేడాది జూన్‌లో సలీమ్‌ డోలా కుమారుడు తాహెర్‌ పట్టుబడ్డాడు. తాహెర్‌ను కూడా యూఏఈ నుంచి భారత్‌కు తీసుకొచ్చి విచారించారు. ఈ క్రమంలోనే సలీమ్‌ డోలా ఆచూకీ లభించినట్లు సమాచారం. .