లద్దాఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాల ఏర్పాటు

లద్దాఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాల ఏర్పాటు
* ఏప్రిల్ 30 నుండి అమిత్ షా రెండు రోజుల పర్యటన 

కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాల ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమోదం తెలిపారు. వీటి ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదొక చరిత్రాత్మక రోజు అని అభివర్ణించియన ఆయన, ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు లద్దాఖ్‌లో లేహ్, కార్గిల్‌ అనే రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి.

ఇప్పుడు కొత్తగా నుబ్రా, షామ్‌, చాంగ్‌థాంగ్‌, జన్‌స్కర్‌, ద్రాస్‌ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో లద్దాఖ్‌లో మొత్తం జిల్లాల సంఖ్య రెండు నుంచి ఏడుకు పెరగనుంది.  లేహ్ జిల్లా నుంచి నుబ్రా, షామ్, చాంగ్‌థాంగ్ అనే మూడు జిల్లాలను ఏర్పాటు చేయగా, కార్గిల్ జిల్లా నుంచి జాన్స్కార్, ద్రాస్ అనే రెండు జిల్లాలను ఏర్పాటు చేశారు. విస్తీర్ణం పరంగా అతి పెద్ద కేంద్రపాలిత ప్రాంతమైనప్పటికీ, జనాభాలో రెండో అతి తక్కువ స్థానంలో ఉన్న లద్ధాఖ్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం దీని విస్తీర్ణం 86,904 చదరపు కిలోమీటర్లు ఉండగా జనాభా 2.74 లక్షలుగా ఉంది.

పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యం పెరగడంతో పాటు వృద్ధి, ఉపాధికి కొత్త మార్గాలు ఏర్పడనున్నాయని సక్సేనా తెలిపారు. లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 2024 అగస్టులో వెల్లడించారు. కాగా, అమిత్ షా ఏప్రిల్ 30న రెండు రోజుల పర్యటన నిమిత్తం లడఖ్‌ను సందర్శించనున్నారు.

ఈ పర్యటనలో ఆయన బుద్ధ పూర్ణిమ సందర్భంగా జరిగే మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, ఆ ప్రాంతంలో జరుగుతున్న కీలక అభివృద్ధి పనులను సమీక్షించనున్నారని లెఫ్టనెంట్ గవర్నర్ తెలిపారు. అలాగే, మే 1 నుండి 14 వరకు లడఖ్‌లో జరగనున్న పవిత్ర అవశేషాల ప్రదర్శన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతపై తన అభిప్రాయాలను పంచుకుంటారని చెప్పారు. మరోవంక, ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో రాజకీయ సంప్రదింపుల దిశగా తీసుకున్న ఒక కీలక అడుగు గురించి ఆయన ప్రకటించారు. 

“భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ, రాజకీయ సంప్రదింపుల ఉప-కమిటీ సమావేశాన్ని మే 22న నిర్వహించాలని నిర్ణయించిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇది లడఖ్‌లోని కీలక భాగస్వాములతో నిర్మాణాత్మక ప్రజాస్వామ్య సంప్రదింపుల ప్రక్రియను ముందుకు తీసుకువెళుతుంది. తద్వారా లడఖ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ఒక శాశ్వత పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుంది,” అని ఆయన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.