తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరీ (ఈడీ) దూకుడు పెంచుతూ కీలక నేతల ఇళ్లు, కార్యాలయాలపై మెరుపు దాడులు నిర్వహించింది. మద్యం పాలసీ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఆరోపణల నేపథ్యంలో, కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
హైదరాబాద్, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ఈ తనిఖీలు ముమ్మరంగా సాగాయి. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. ముఖ్యంగా కీలకమైన రాజకీయ నేతలు మరియు వారికి సన్నిహితంగా ఉండే వ్యక్తుల నివాసాలే లక్ష్యంగా అధికారులు రంగంలోకి దిగారు. రాజ్ కెసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కాల్వ ధనుంజయరెడ్డి, పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, ముప్పిడి అవినాష్‌రెడ్డి, బూనేటి చాణక్య, తల్లా అవినాష్ గౌడ్, సజ్జల శ్రీధర్‌రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.
వీరిలో రాజ్ కెసిరెడ్డి మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు. కుంభకోణం కుట్రకు రూపకల్పన మొదలు అమలు వరకూ ప్రతి దశలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానై కీలకంగా వ్యవహరించారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైఎస్సార్సీపీ ముఖ్యనేత, జగన్‌కు సన్నిహితుడు. ఆస్తి పత్రాలు, లావాదేవీల రికార్డులను పెద్ద ఎత్తున ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మద్యం సరఫరా సంస్థల నుంచి రూ.3,500 కోట్ల లంచాలు వసూలు చేశారని దర్యాప్తులో గుర్తించిన ఈడీ ఇప్పటికే వెయ్యి రూ. 48. 45 కోట్ల మూలాల్ని వెలికితీసింది. రూ.441 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. తాజాగా మరోసారి రంగంలోకి దిగి ఈ సోదాల్లో లభించిన పత్రాలను విశ్లేషిస్తున్న ఈడీ త్వరలో మరిన్ని ఆస్తులు జప్తు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కేవలం వ్యాపారవేత్తలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ పెద్దల దరిదాపుల్లో ఉండే వారి వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ దాడుల వెనుక పక్కా ఆధారాలు ఉన్నాయని, విదేశీ లావాదేవీల కోణంలో కూడా విచారణ జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలను విశ్లేషించిన తర్వాత, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను మార్పులకు దారితీస్తాయని, మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

More Stories
వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్
ఏపీ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యులను భర్తీ చేయండి
మహిళలకు ద్రోహం చేయడం జాతి విద్రోహంతో సమానం