హరిత హైడ్రోజన్ భవిష్యత్ ఇంధనమని పేర్కొంటూ హైడ్రోజన్ ఇంధన కేంద్రాన్ని ఆర్థికంగా లాభదాయకంగా మార్చడానికి దాని నిర్వహణ వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. లాజిస్టిక్స్ శక్తి సమిట్ & అవార్డ్స్ 2026 రెండో ఎడిషన్‌లో ప్రసంగిస్తూ భవిష్యత్‌లో 100 శాతం ఇథనాల్ బ్లెండింగ్ సాధించాలని కేంద్ర సూచించారు.
పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధన సరఫరాలో ఆటంకాలు ఎదుర్కొంటున్నామని గుర్తు చేస్తూ ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరముందని తెలిపారు. “భారత్ ఇంధన రంగం 87 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందుకోసం ఏకంగా ఏటా రూ.22 లక్షల కోట్లను ఖర్చుచేస్తోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇంధన ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై దృష్టి సారించాలి” అని చెప్పారు.
“కేవలం ఇథనాల్‌తోనే కాకుండా చెత్త నుంచి హైడ్రోజన్ తయారీ వంటి వినూత్న పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల వినియోగం తగ్గించాలి” అని గడ్కరీ చెప్పారు. పెట్రోల్ ఉత్పత్తుల్లో 20 శాతం ఇథనాల్ వాడకంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను గడ్కరీ తోసిపుచ్చారు. అంతేకాకుండా ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరల మీదనే కాకుండా ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు అనుకూలంగా ఉండేలా నాణ్యమైన ఇంజన్ల తయారీపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారులపై డిసెంబర్ నాటికి ఎలాంటి ఆటంకాలు లేని, నిరంతరాయ టోలింగ్‌ను అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కొత్త వ్యవస్థ ఏఐ అనలిటిక్స్‌తో కూడిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఎపిఎన్ఆర్)తో పాటు ఆర్ఎఫ్ఐడి ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఫాస్టాగ్)వంటి సాంకేతికతలను ఉపయోగించి ఎలాంటి అడ్డంకులు లేని టోలింగ్‌ను సులభతరం చేస్తుందని తెలిపారు.
దీని ప్రకారం టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా అధిక పనితీరు గల ఎపిఎన్ఆర్ కెమెరాలు, ఫాస్టాగ్ రీడర్ల ద్వారా వాహనాలను గుర్తించి, వాటి నుంచి ఛార్జీ వసూలు చేస్తారని గడ్కరీ వివరించారు. నిబంధనలను పాటించని పక్షంలో ఉల్లంఘించిన వారికి ఇ-నోటీసులు జారీ చేస్తారని, వాటిని చెల్లించకపోతే ఫాస్టాగ్ సస్పెన్షన్, ఇతర వాహన సంబంధిత జరిమానాలు విధిస్తారని స్పష్టం చేశారు.
భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలంటే లాజిస్టిక్స్ వ్యయాన్ని సింగిల్ డిజిట్‌కు తగ్గించుకోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఐఐటీ చెన్నై, ఐఐటీ కాన్పుర్, ఐఐఎం బెంగళూరు రూపొందించిన ఒక నివేదిక ప్రకారం భారత ఎక్స్‌ప్రెస్‌వేలు, ఆర్థిక కారిడార్ల నిర్మాణం వల్ల దేశ లాజిస్టిక్స్ వ్యయం గతంలోని 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గిందని వెల్లడైందని పేర్కొన్నారు. అమెరికాలో లాజిస్టిక్స్ వ్యయం 12 శాతం, ఐరోపా దేశాల్లో 12 శాతం, చైనాలో 8-10 శాతంగా ఉందని వివరించారు.

More Stories
సాఫ్ట్వేర్ రంగంలో భద్రతపై హిందూ మహిళల గర్జన
అమెరికా- ఇరాన్ చర్చల్లో ప్రశ్నార్ధకంగా పాకిస్తాన్ దౌత్యం!
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు దిగొచ్చిన ప్రభుత్వం