పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో చారిత్రాత్మకంగా 92.88 శాతం ఓటింగ్ నమోదైన నేపథ్యంలో, బీజేపీ 110కి పైగా సీట్లు గెలుచుకుంటుందని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె టీఎంసీ ప్రభుత్వానికి ఘోర పరాజయం తప్పదని హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ధీమా వ్యక్తం చేశారు. “మాకు అందిన స్పందనను బట్టి, పశ్చిమ బెంగాల్ ప్రజలు మొదటి దశలోనే తమ నిర్ణయాన్ని తీసుకున్నారు. 16 జిల్లాల్లోని 52 స్థానాల్లో 92.98 శాతం ఓటింగ్ నమోదు కావడం, ‘దీదీ’ పయనమవుతున్నారని, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతోందని చూపిస్తుంది. భయం పోయి, దాని స్థానంలో విశ్వాసం వస్తుంది,” అని ఆయన వెల్లడించారు.
“నిన్న రాత్రి కమిటీ సభ్యులతో పరిస్థితిని సమీక్షించిన తర్వాత, 152 స్థానాలకు గాను బీజేపీ 110కి పైగా సీట్లు గెలుస్తుందని మేము అంచనా వేస్తున్నాము. అంటే, రెండో దశ పోలింగ్ తర్వాత బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మేము ముందుకు సాగుతున్నాము,” అని కోల్‌కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత పోలింగ్ ప్రక్రియను నిర్ధారించినందుకు ఎన్నికల సంఘానికి, స్థానిక పోలీసులకు, భద్రతా దళాలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
“ఎన్నికల సంఘానికి, సీఏపీఎఫ్‌కు, బెంగాల్ పోలీసులకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాన. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఒక్క వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోని మొదటి ఎన్నిక ఇది. ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి. మొదటి దశ తర్వాత, బెంగాల్ ఓటర్లు అభివృద్ధిని ఎంచుకున్నారని స్పష్టమైంది,” అని ఆయన చెప్పారు. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని, అధిక ఓటింగ్ శాతం అదే విషయాన్ని స్పష్టం చేస్తోందని అమిత్ షా పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ భారీ పోలింగ్ ఉత్సాహాన్ని కలిగిస్తుందని చెబుతూ తొలి దశలో ఓటు వేసిన ప్రతి ఓటరికి అభినందనలు తెలిపారు. “భయం నుంచి భరోసా దిశగా ప్రారంభమైన ఈ ప్రయాణాన్ని రెండో దశలోనూ కొనసాగించాలి” అని పిలుపునిచ్చారు. ఇక బీజేపీ అధికారంలోకి వస్తే “బయటి వాళ్లు పాలిస్తారు” అనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచారాన్ని కొట్టిపారవేస్తూ బెంగాల్లో పుట్టి, బంగాలీ మాట్లాడే వ్యక్తే బీజేపీ తరఫున ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టం చేశారు.
మహిళల భద్రత బీజేపీ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యంగా ఉంటుందని అమిత్ షా హామీ ఇచ్చారు. రాత్రి వేళల్లో కూడా మహిళలు భయపడకుండా బయటకు రావగల పరిస్థితిని తీసుకువస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న భయ వాతావరణాన్ని పూర్తిగా తొలగిస్తామని భరోసా ఇచ్చారు. అవినీతి, సిండికేట్ రాజ్‌ను పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన స్పష్టం చేశారు.

More Stories
బీజేపీలో రాఘవ్ చద్దాతో సహా ఏడుగురు ఆప్ ఎంపీలు
మొదటి దశ పోలింగ్ “మహా జంగిల్ రాజ్” అంతానికి “నాంది”
ట్రంప్ ‘నరక కూపం’ వ్యాఖ్యలపై అమెరికా దిద్దుబాటు చర్యలు