ప్రైవేట్‌ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల ధరలతో ‘విద్యా వివక్ష’

ప్రైవేట్‌ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల ధరలతో ‘విద్యా వివక్ష’
దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల ఎంపిక, అధిక ధరలకు ప్రైవేట్‌ పబ్లిషర్ల పుస్తకాలను విక్రయించడంపై వస్తున్న ఫిర్యాదులను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) తీవ్రంగా పరిగణించింది. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాల తీరును ‘విద్యా వివక్ష’గా అభివర్ణిస్తూ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు, సిబిఎస్‌ఇకి నోటీసులు జారీ చేసింది. 

30 రోజుల్లో పాఠ్యపుస్తకాల జాబితాలపై దేశవ్యాప్త ఆడిట్‌కు ఆదేశించింది. ఈ నెల 9న అందిన ఈ ఫిర్యాదులు, మీడియా కథకాలపై తాజాగా ఎన్‌హెచ్‌ఆర్‌సి స్పందించింది. ఎంపిక చేసిన ప్రచురణ సంస్థల నుంచి కాకుండా, ప్రైవేట్‌ పుస్తకాలు కొనుగోలు చేయాలని తమను బలవంతం చేస్తున్నారని, ఏటా సవరించబడుతోన్న పుస్తకాలు తమకు ఆర్థిక భారాన్ని గణనీయంగా పెంచుతున్నాయని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

ఈ అంశంపై నమో ఫౌండేషన్‌ దాఖలు చేసిన ఫిర్యాదును స్వీకరించిన, ఎన్‌హెచ్‌ఆర్‌సి ప్రియాంక్‌ కనూంగో నేతృత్వంలో జరిగిన విచారణలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల ధర రూ.200 నుంచి రూ.700 మధ్యలో ఉంటే, ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాల సెట్‌ ధర రూ.3,000 నుంచి రూ.10,000 వరకు ఉంటోందని కమిషన్‌ దృష్టికి వచ్చింది.

అనేక ప్రైవేట్‌ పబ్లిషర్ల పుస్తకాలను సూచించడంవల్ల స్కూల్‌ బ్యాగుల బరువు అసాధారణంగా పెరుగుతోందని, ఇది చిన్నపిల్లల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ హెచ్చరించింది. ప్రైవేట్‌ స్కూల్స్‌ సూచిస్తోన్న ఈ ఖరీదైన పుస్తకాలు తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడంతో పాటు విద్యకు దూరం చేసే ఆందోళనలు రేకెత్తిస్తోందని అభిప్రాయపడింది.ఈ పరిస్థితులు బాలల ఉచిత, నిర్భంధ విద్యా హక్కు (ఆర్‌టిఐ) చట్టం ఉల్లంఘనలను సూచిస్తోందని పేర్కొంది.

ఈ చట్టంలోని సెక్షన్‌ 29 ప్రకారం నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌ఎస్‌ఇఆర్‌టి) వంటి నియమిత విద్యా ఆధికార సంస్థలే పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకాలను రూపొందించాల్సి ఉంటుందని గుర్తు చేసింది.  ప్రైవేట్‌ పుస్తకాలను సూచించడం అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుందని, ఉచిత, సమానమైన ప్రాథమిక విద్య అనే చట్టం ఉద్దేశాన్నే దెబ్బతీయవచ్చని పేర్కొంది. ఇది జాతీయ విద్యా విధానం(ఎన్‌ఇపి) 2020 లక్ష్యాలను నీరుగార్చే ప్రమాదం ఉందని తెలిపింది.

ప్రైవేట్‌ ప్రచురణలను సూచించడం వల్ల పిల్లల స్కూల్‌ బ్యాగ్‌ల బరువు పెరిగి, వారి ఆరోగ్యాలపై ప్రమాదం చూపే అవకాశం ఉందని పేర్కొంది. తద్వారా జాతీయ విధానాన్ని ఉల్లంఘించడమే అవుతుందని గుర్తు చేసింది.  వాణిజ్య ప్రయోజనాలతో నడిచే ‘రెండు అంచెల విద్యా వ్యవస్థ’ ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్‌టిఐ నిబంధలను పాటించేలా ఆదేశాలు జారీ, 30 రోజుల్లో నిర్దేశిత పుస్తకాల స్కూల్స్‌ వారిగా ఆడిట్‌ చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఎన్‌ఎస్‌ఇఆర్‌టి వంటి సంస్థల పాత్ర, ప్రాథమిక స్థాయిలో పరీక్షా బోర్డులకు అధికార పరిధి వంటి అంశాలపై 15 రోజుల్లో స్పష్టం చేయాలని కేంద్ర విద్యా శాఖను ఆదేశించింది.