* హిందూ మహాసముద్రంలో ఇరాన్ చమురు నౌక అమెరికా సీజ్
అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నా హోర్ముజ్ జలసంధిపై పట్టు కోసం ఆ రెండు దేశాల నౌకాదళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ మార్గంలో వెళ్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ నేవీ దాడులు చేస్తుండగా, ఇరాన్ పోర్టులను అమెరికా నేవీ దిగ్బంధించింది. అయితే, ఇరాన్ నౌకాదళాన్ని పూర్తిగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ హోర్ముజ్‌లో ఇరాన్ భారీగా చిన్న బోట్లను మోహరించినట్లు తాజాగా తీసిన ఉపగ్రహ చిత్రాల్లో బయటపడింది.
నౌకా విధ్వంసక ఆయుధాలు, స్వల్ప శ్రేణి క్షిపణులు అమర్చిన స్పీడ్ బోట్లను ఇరాన్ నౌకాదళం హోర్ముజ్ జలసంధిలోని ఉత్తర భాగంలో రహస్యంగా మోహరించినట్లు ఓపెన్ సోర్స్ పరిశోధకుడు మెహదీ హెచ్ గురువారం తెలిపారు. దాదాపు 33 బోట్లు దాడులకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సెంటినెల్-2 ఉపగ్రహం ద్వారా తీసిన చిత్రాల ఆధారంగా ఈ విషయాన్ని తెలిపారు.
ఈ బోట్లను మోహరించేందుకు పెద్దపెద్ద నౌకాశ్రయాలు అవసరం ఉండదు. సముద్రంలో ఇవి శత్రువుపై మెరుపు వేగంతో దాడులు చేసి మాయమైపోతాయి. ఇలాంటి బోట్లు ఇరాన్ వద్ద భారీగా ఉన్నట్లు భావిస్తున్నారు. వీటిని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నిర్వహిస్తోంది. ఈ పరిణామంతో అసహనం వ్యక్తం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో, హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తున్న ఇరాన్ చిన్న పడవలను “కాల్చి చంపాలని” అమెరికా సైన్యాన్ని ఆదేశించారు.
ఆ చిన్నబోట్లతోనే హర్మూజ్ మార్గంలోని సముద్ర జలాల్లో ఇరాన్ మైన్లను పెడుతోందని పేర్కొంటూ మైన్లు పెట్టేందుకు యత్నించే ఇరాన్ చిన్నబోట్ల ఏరివేతకు ఏ మాత్రం సంకోచించొద్దని ఆయన నిర్దేశించారు. ఈ కీలకమైన జలమార్గంలో సైన్యం తన మైన్-క్లియరింగ్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని కూడా ట్రంప్ తెలిపారు. మరోవంక, హిందూ మహాసముద్రంలో మెజెస్టిక్ ఎక్స్ అనే చమురు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది.
“అక్రమ నెట్‌వర్క్‌లను అడ్డుకోవడానికి, ఇరాన్‌కు భౌతిక మద్దతును అందించే నౌకలను అవి ఎక్కడ పనిచేస్తున్నా సరే నిరోధించడానికి మేము ప్రపంచవ్యాప్త సముద్ర నిఘాను కొనసాగిస్తాము,” అని రక్షణ శాఖ పేర్కొంది. నౌక సీజ్‌కు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ ఖాతాలో విడుదల చేసింది. హెలికాప్టర్ల నుంచి ఈ నౌకపైకి అమెరికా దళాలు దిగుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. కాగా, హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన సీమైన్లను తొలగించేందుకు సుమారు ఆర్నెళ్ల సమయం పడుతుందని అమెరికా చట్టసభ ప్రతినిధులకు పెంటగాన్ తెలిపింది.

More Stories
నావికుల భద్రతపై భారత్ ఆందోళన
చరిత్రలోనే అతిపెద్ద ఇంధన భద్రత ముప్పు
సముద్రంలోని ఇంటర్నెట్ కేబుళ్లను టార్గెట్ చేస్తున్న ఇరాన్