అమెరికా- ఇరాన్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం అమలవుతున్న నేపథ్యంలో ఇరాన్‌కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. భారత్నుంచి కూడా ఇరాన్‌కు విమానాలు నడుస్తున్నాయి. దీనితో ఇరాన్ జాతీయ విమానయాన సంస్థకు తన నెట్‌వర్క్‌ను క్రమంగా పునర్నిర్మించుకోవడానికి, విమానాలను తిరిగి ప్రవేశపెట్టడానికి, ప్రయాణీకులకు, సరుకు రవాణాకు అనుసంధానాన్ని పునరుద్ధరించడానికి వీలు కల్పిస్తుంది.
గగనతలాన్ని తిరిగి తెరవడం ఒక ప్రధాన కార్యాచరణ అవరోధాన్ని తొలగిస్తుంది. తద్వారా విమానయాన సంస్థలు సాధారణ షెడ్యూలింగ్ మరియు విమాన ప్రణాళికను తిరిగి ప్రారంభించడానికి వీలు కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులు ఇరాన్ పర్యటనను రద్దు చేసుకోవాలని హెచ్చరించింది.
భూ మార్గం ద్వారాగానీ, వాయు మార్గం ద్వారాగానీ ఇరాన్ ప్రయాణించడం శ్రేయస్కరం కాదని సూచించింది. ఇరాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా, అలాగే కొన్ని దేశాలకు విమాన సర్వీసులు ఇంకా నిలిచిపోయిన నేపథ్యంలో ఇరాన్ ప్రయాణించడం మంచిది కాదని ఇండియన్ ఎంబసీ తెలిపింది.
అలాగే, ఇరాన్‌లో ఉన్న భారతీయులు కూడా ఆ దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇందుకోసం తాము సూచించిన సరిహద్దు మార్గాల ద్వారా సురక్షితంగా ఇరాన్ విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో సాయం అందిస్తామని ఎంబసీ ప్రకటించింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇండియాన్ ఎంబసీ ఈ ఆదేశాలు జారీ చేసింది.
పౌరులు తమను సంప్రదించేందుకు అవసరమైన ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలను కూడా ఎంబసీ విడుదల చేసింది. ఇక, ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇరాన్ సహా యుద్ద ప్రభావిత ప్రాంతం నుంచి భారత్ కు 12 లక్షల మంది వచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ గల్ఫ్ విభాగం (ఎంఈఏ గల్ఫ్) తెలిపింది. కాగా, యూఏఈ, భారత్ మధ్య విమానాల రాకపోకలు సజావుగా సాగుతున్నాయని ఎంఈఏ గల్ఫ్ సెక్రెటరీ అసీమ్ ఆర్ మహాజన్ తెలిపారు. గురువారం ఒక్క రోజే యూఏఈ నుంచి ఇండియాలోని వివిధ ప్రదేశాలకు మొత్తం 110 విమానాలు ప్రయాణించినట్లు చెప్పారు.

More Stories
సీమైన్లను పెట్టే బోట్లను పేల్చేయండి… ట్రంప్
నావికుల భద్రతపై భారత్ ఆందోళన
చరిత్రలోనే అతిపెద్ద ఇంధన భద్రత ముప్పు