దేశంలో ప్రతిపక్ష పార్టీల అనాలోచిత నిర్ణయంతోనే దక్షిణ రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతోందని బీజేపీ మహిళా పాలసీ, రీసెర్చ్ విభాగం జాతీయ ఇన్ ఛార్జ్ కరుణ గోపాల్ స్పష్టం చేశారు.131వ రాజ్యాంగ సవరణ బిల్లును విపక్షాలు అడ్డుకోవడం ద్వారా దక్షిణ భారతదేశంలోని లోక్‌సభ సీట్లు తగ్గే ప్రమాదాన్ని వారే స్వయంగా కొనితెచ్చుకున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ సీట్లను ప్రోరేటా పద్ధతిలో పెంచాలని ఆలోచించారని, దీనివల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళం వంటి రాష్ట్రాలకు సీట్లు పెరిగే అవకాశం ఉండేదని ఆమె తెలిపారు. కానీ విపక్షాలు దీనిని అడ్డుకోవడంతో ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలోనే సెన్సస్, డిలిమిటేషన్ ప్రక్రియలకు వెళ్లాల్సి వస్తోందని ఆమె హెచ్చరించారు. ఇది పూర్తవడానికి కనీసం 5-6 ఏళ్లు పడుతుందని, ఫలితంగా జనాభా నియంత్రణ పాటించిన దక్షిణ రాష్ట్రాలు సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఆమె స్పష్టం చేశారు.
ఆర్టికల్ 334ఎ ప్రకారం డిలిమిటేషన్ లేకుండా మహిళా రిజర్వేషన్ అమలు అసాధ్యం అని ఆమె స్పష్టం చేశారు. కరోనా కారణంగా సెన్సస్ ఆలస్యమైందనేది వాస్తవం అని ఆమె తెలిపారు. గతంలో (2004-2014) అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఈ బిల్లును లోక్‌సభలో పట్టించుకోలేదని పేర్కొంటూ గతంలో పార్లమెంట్‌లో బిల్లును చింపివేసినా, మహిళా నాయకులను అవమానించినా విపక్ష మహిళా నేతలు నోరు మెదపలేదని కరుణా గోపాల్ ధ్వజమెత్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ మహిళల కోసం “వూమ్ టు టూమ్” (పుట్టుక నుండి మరణం వరకు) అన్నట్లుగా అనేక పథకాలు ప్రవేశపెట్టారని, ముద్రా లోన్లు, స్టార్టప్‌లు, ఆయుష్మాన్ భారత్ మరియు డ్రోన్ దీదీ వంటి పథకాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని కరుణ గోపాల్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళలు సమానంగా భాగస్వాములయితే దేశ జిడిపి 30% వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతూ అందుకే మహిళలు కేవలం ఓటర్లుగానే కాకుండా పాలసీ మేకర్స్‌గా ఎదగాలనేది ప్రధాని మోదీ ఆకాంక్ష అని ఆమె చెప్పారు.
మహిళలకు అధికారం కట్టబెట్టాలనే మోదీ గారి సంకల్పానికి అడ్డుతగులుతూ, విపక్షాలు ముఖ్యంగా దక్షిణ భారతదేశ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని ఆమె మండిపడ్డారు. మహిళలు ఈ మోసాన్ని గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో విపక్షాలకు తగిన గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు.

More Stories
రేవంత్ పర్యటనలో ఎన్డిఎస్ఏ ఛైర్మన్… బండి సంజయ్ ఆగ్రహం
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత
కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేసిన హైకోర్టు