హార్మూజ్ దిగ్బంధం వేళ అమెరికా నేవీ కార్యదర్శి రాజీనామా!

హార్మూజ్ దిగ్బంధం వేళ అమెరికా నేవీ కార్యదర్శి  రాజీనామా!
అమెరికా నావికాదళ అత్యున్నత పౌర అధికారి, నేవీ సెక్రటరీ జాన్ ఫెలాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ బుధవారం ప్రకటించారు. ఇరాన్‌తో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, హార్మూజ్ జలసంధి వద్ద అమెరికా నేవీ దిగ్బంధనం విధిస్తున్న తరుణంలో ఈ రాజీనామా వెలువడటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 
 
రాజీనామాకు కేవలం ఒక రోజు ముందే ఆయన వాషింగ్టన్‌లో జరిగిన నేవీ వార్షిక సదస్సులో పాల్గొని, తన భవిష్యత్తు ప్రణాళికల గురించి మీడియాలో ఉత్సాహంగా మాట్లాడారు. అయితే మరుసటి రోజే ఆయన వైదొలగడం వెనుక బలమైన కారణాలు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.  రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలువురు ఉన్నతాధికారులపై వేటు వేయడం, వారికి వారే స్వచ్చంధంగా తప్పుకోవడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి.
గత వారమే ఆర్మీ టాప్ ఆఫీసర్ జనరల్ రాండీ జార్జ్ ను పదవి నుండి  తొలగించారు.    జాన్ ఫెలాన్‌కు సైనిక నేపథ్యం లేదు. ఆయన ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అయిన రగ్గర్ మేనేజ్‌మెంట్ ఎల్ఎల్‌సీ వ్యవస్థాపకుడు.  అలాగే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారానికి భారీ విరాళాలు అందించిన వ్యక్తి. ఉక్రెయిన్, తైవాన్ రక్షణకు మద్దతునిచ్చే ‘స్పిరిట్ ఆఫ్ అమెరికా’ అనే స్వచ్ఛంద సంస్థలో సలహాదారుగా పని చేసిన అనుభవంతో ఆయన 2024లో ఈ బాధ్యతలు చేపట్టారు. 
ఇదిలా ఉండగా, జాన్ ఫెలాన్ స్థానంలో నేవీ అండర్ సెక్రటరీ హంగ్ కావో తాత్కాలిక సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు.  హంగ్ కావోకు 25 ఏళ్ల పాటు నావికాదళంలో పనిచేసిన అపారమైన అనుభవం ఉంది. 1970లలో వియత్నాం నుంచి శరణార్థిగా అమెరికాకు వచ్చిన కావో యుద్ధ క్షేత్రాల్లోనూ సేవలు అందించారు. 2024లో వర్జీనియా సెనేట్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతు ఉంది.
 
కావో తన ప్రచారంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అత్యంత ఘాటుగా స్పందించే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఇరాన్ అనుకూల నౌకలను అమెరికా టార్గెట్ చేస్తున్న ఈ క్లిష్ట సమయంలో నాయకత్వ మార్పు నేవీ వ్యూహాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.