మాలేగావ్ పేలుళ్ల కేసులో న‌లుగురు నిందితుల‌కు విముక్తి

2006లో మాలేగావ్‌లో జ‌రిగిన పేలుళ్ల ఘ‌ట‌న‌తో లింకున్న కేసులో న‌లుగురు నిందితుల‌కు బాంబే హైకోర్టు విముక్తి క‌ల్పించింది. ఆ కేసు నుంచి వాళ్ల‌ను డిశ్చార్జ్ చేసింది. ఆ న‌లుగురిపై స్పెష‌ల్ కోర్టు న‌మోదు చేసిన అభియోగాల‌ను హైకోర్టు కొట్టివేసింది. చీఫ్ జ‌స్టిస్ శ్రీ చంద్ర‌శేక‌ర్‌, జ‌స్టిస్ శ్యామ్ చంద‌క్‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది.  రాజేంద్ర చౌద‌రీ, ధాన్ సింగ్, మ‌నోహ‌ర్ రామ్ సింగ్ న‌ర్వారియా, లోకేశ్ శ‌ర్మ‌లు దాఖ‌లు చేసిన అప్పీళ్ల‌ను హైకోర్టు స్వీక‌రించింది.
అయితే ఈ కేసులో కోర్టు ఆదేశాల‌కు చెందిన పూర్తి కాపీ ఇంకా అందాల్సి ఉన్న‌ది. మాలేగావ్ పేలుళ్ల ఘ‌ట‌న‌లో న‌లుగురిపై ఐపీసీ, యూఏపీఏ సెక్ష‌న్ల కింద కేసు బుక్ చేశారు.
2006 సెప్టెంబ‌ర్ 8వ తేదీన నాసిక్ జిల్లాలోని మాలేగావ్ ప‌ట్ట‌ణంలో నాలుగు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అయితే శుక్ర‌వారం ప్రార్థ‌న‌లు ముగిసిన స‌మ‌యంలో హ‌మిదియా మ‌జీద్‌, బ‌డా ఖ‌బ‌ర‌స్తాన్ ప్రాంతాల్లో పేలుళ్లు జ‌రిగాయి. ముషావ‌ర‌త్ చౌక్ వ‌ద్ద కూడా పేలుడు జ‌రిగింది. 

ఆ పేలుళ్ల‌లో మొత్తం 31 మంది మృతిచెంద‌గా, మ‌రో 312 మంది గాయ‌ప‌డ్డారు. మ‌హారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు ఈ కేసును విచారించారు. ఈ కేసుతో లింకున్న 9 మంది ముస్లింల‌ను అరెస్టు చేశారు. ఆ త‌ర్వాత ఈ కేసును ఎన్ఐఏ త‌న ఆధీనంలోకి తీసుకున్న‌ది. బ్లాస్ట్ వెనుక అతివాద తీవ్ర‌వాదులు ఉన్న‌ట్లు ఎన్ఐఏ ఆరోపించింది. దానిలో భాగంగా న‌లుగుర్ని అరెస్టు చేశారు.

స్పెష‌ల్ కోర్టు త‌న ఆదేశాల్లో 9 మంది ముస్లింల‌ను కేసు నుంచి రిలీజ్ చేసింది. ఇక గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో ఈ న‌లుగురిపై అభియోగాలు న‌మోదు చేసింది. ఆ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ వాళ్లు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఎన్ఐఏ త‌న ద‌ర్యాప్తులో త‌మ‌పై ఎటువంటి ఆధారాల‌ను చూప‌లేద‌ని నిందితులు పేర్కొన్నారు.