అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ పొడిగింపు

అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ పొడిగింపు

ఇరాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరుదేశాల మధ్య గతంలో కుదిరిన కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం ఒక సమగ్ర ప్రతిపాదనను సమర్పించే వరకు ఈ కాల్పుల విరమణ కొనసాగుతుందని తెలిపారు. అమెరికా – ఇరాన్ మధ్య ఈ నెల 8వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు వారాల ఈ సీజ్ ఫైర్ మరో కొద్ది గంటల్లో ముగియనుందనగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే, పాకిస్థాన్ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించినట్లుగా ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ల అభ్యర్థన మేరకు సైనిక చర్యను వాయిదా వేసి, దౌత్య చర్చలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు.  అయితే, సీజ్ ఫైర్ కొనసాగుతున్న సమయంలోనే ఇరాన్‌పై సముద్ర దిగ్భంధనాన్ని కొనసాగించాలని సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లుగా ట్రంప్ స్పష్టం చేశారు. 

“ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వారు ఏకీకృత ప్రతిపాదనతో రావడానికి సమయం అవసరం. అందుకే ఈ దాడిని నిలిపివేసి, సీజ్‌ఫైర్ పొడిగించాం” అని తెలిపారు. హర్మూజ్​పై ట్రంప్ స్పందిస్తూ ఆ జలసంధిని ఇరాన్​ తెరిచి ఉంచాలని కోరుకుంటుందని ట్రంప్ పేర్కొన్నారు. 

“హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ కోరుకోవడం లేదు. దానిని తెరిచి ఉంచాలని కోరుకుంటోంది. ఎందుకంటే దాని ద్వారా వారు రోజుకు 500 మిలియన్ డాలర్లు సంపాదించగలరు. నేను దానిని పూర్తిగా దిగ్బంధించాను కాబట్టే, వారు దానిని మూసివేయాలని అంటున్నారు. వారు కేవలం పరువు కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం కొందరు నన్ను సంప్రదించి, ఇరాన్ వెంటనే జలసంధిని తెరవాలని కోరుకుంటోందని చెప్పారు’ అని ట్రంప్​ ట్రూత్​ సోషల్​లో పేర్కొన్నారు. 

మరోవైపు, ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన చర్చలకు వెళ్లే విషయంలో ఇరాన్ తన వైఖరిని స్పష్టంగా చెప్పకపోవడంతో మంగళవారం మెుత్తం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇరాన్‌ను ఒప్పించేందుకు పాకిస్థాన్ శతవిధాలా ప్రయత్నించింది. అయినా టెహ్రాన్ అంగీకరించలేదు. చివరకు తాము చర్చల్లో పాల్గొనడం లేదని ఇరాన్ ప్రభుత్వం తమ నియంత్రణలోని మీడియా ద్వారా తెలియజేసింది. 
 
దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం తమ పాకిస్థాన్ పర్యటనను వాయిదా వేసుకుంది. అమెరికా మళ్లీ తమపై దాడులు చేస్తే మధ్యప్రాచ్యంలోని చమురు రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌(ఐఆర్​జీసీ) ఏరోస్పేస్ కమాండర్ జనరల్ మాజిద్ మౌసవి హెచ్చరించారు.