ప్రకాష్ రాజ్ పై కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు

ప్రకాష్ రాజ్ పై కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు

* నాస్తికత్వం అంటే దేవుళ్ళను ఎగతాళి చేయడం కాదు,,, బాగబాబు మండిపాటు 

ప్రకాష్ రాజ్ హిందూ ధర్మాన్ని, రామాయణాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి  హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేరళలో జరిగిన ఒక సాహిత్య వేడుకలో రామాయణ ఇతిహాసాన్ని వక్రీకరించారని, శ్రీరాముడిని అవమానించేలా మాట్లాడి సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

తక్షణమే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.  ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ రామాయణ గాథపై వింతైన వ్యాఖ్యలు చేశారు.  “రామలక్ష్మణులు ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వలస కూలీలని, రావణుడు అనే గిరిజన భూస్వామి తోటలో పండ్లు దొంగలించారని, ఆ వివాదం వల్లే రామాయణ యుద్ధం జరిగిందన్నట్లుగా” ఆయన చేసిన ప్రసంగం తీవ్ర నిరసనలకు దారితీసింది. 

ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. చారిత్రక, ఆధ్యాత్మిక వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రకాష్ రాజ్ సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ‘నిర్దిగంత’ అనే నాటక సంస్థ ద్వారా చిన్న పిల్లల చేత హిందూ వ్యతిరేక నాటకాలు వేయిస్తూ, పసిపిల్లల మనసుల్లో మతపరమైన విషాన్ని నింపుతున్నారని ఆమె ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించిన కళ్యాణి భారత న్యాయ సంహిత, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

 జనసేన నేత, నటుడు నాగబాబు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకాశ్ రాజ్‌కు గత వారం ఘాటుగా సమాధానమిచ్చారు.  నాగబాబు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ప్రకాశ్ రాజ్ వైఖరిని ఎండగడుతూ “ప్రకాష్ రాజ్ గారు మీరు మిమ్మల్ని మీరు క్రైస్తవ నాస్తికుడని చెప్పుకున్నప్పటికీ, మీ తల్లిగారి అంత్యక్రియలప్పుడు ఆమె విశ్వాసాన్ని గౌరవించారు. ఒక కొడుకుగా అది మీ కర్తవ్యంగా మేము గౌరవిస్తాము. అదే స్ఫూర్తితో మీరు కోట్లాది మంది నమ్మకాలను గౌరవించాలి” అంటూ హితవు చెప్పారు. 

“నాస్తికత్వం అంటే దేవుళ్ళను గానీ, విశ్వాసులను గానీ ఎగతాళి చేయడం కాదు, అది ఒక హేతుబద్ధమైన ఆలోచనా విధానం. హిందూమతం మాత్రమే తన సిద్ధాంతాల ద్వారా నాస్తిక తత్వాన్ని కూడా స్వీకరించిన ఏకైక మతం. అటువంటి సంప్రదాయాన్ని తోసిపుచ్చడం హేతుబద్ధం కాదు, అది అగౌరవం” అని స్పష్టం చేశారు.  “ఇతర దేశాలలో అయితే ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టి ఉండేవి. మీపై ఇది నా సూటి వ్యాఖ్య భవిష్యత్తులో మీలాంటి గౌరవహీనమైన వ్యక్తులతో నేను ఎప్పటికీ వాదించను. విభిన్న విశ్వాస వ్యవస్థలను గౌరవించడమే హేతుబద్ధతకు, బాధ్యతకు నిజమైన నిదర్శనం” అంటూ రాసుకొచ్చారు.

ఈ వివాదం దేశవ్యాప్తంగా ముదరడంతో ప్రకాష్ రాజ్ స్పందిస్తూ రెండ్రోజుల క్రితం ఒక సెల్ఫ్ వీడియోను విడుదల చేశారు. “తాను హిందూ వ్యతిరేకిని కాదని, అన్ని మతాలను గౌరవిస్తానని” పేర్కొన్నారు. శ్రీరాముడిని అవమానించే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.  తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.  అయితే, ఆయన వివరణ ఇచ్చినప్పటికీ నెటిజన్ల ఆగ్రహం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో #BanPrakashRaj అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ప్రకాష్ రాజ్‌ను సినిమాల నుంచి బహిష్కరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.