హర్మూజ్​ను మళ్లీ మూసేసిన ఇరాన్.. 20న అమెరికాతో చర్చలు!

హర్మూజ్​ను మళ్లీ మూసేసిన ఇరాన్.. 20న అమెరికాతో చర్చలు!

హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్లు శనివారం వెల్లడించింది. తమ నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా అమెరికా ఆంక్షలను ఎత్తివేసే వరకు, హర్మూజ్‌పై తమ కఠిన నియంత్రణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అణ్వస్త్ర కార్యక్రమం సహా అన్ని అంశాలపై తమతో తుది ఒప్పందాన్ని కుదుర్చుకునే దాకా ఇరాన్ ఓడరేవుల ముట్టడిని ఆపేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.

లెబనాన్ – ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా హర్మూజ్‌ను పూర్తిగా తెరిచినట్లు శుక్రవారమే ఇరాన్ ప్రకటించింది. అయినప్పటికీ తమ ఓడరేవుల ముట్టడిని అమెరికా కొనసాగిస్తున్నందుకు నిరసనగా, కొన్ని గంటల్లోనే ఇరాన్ నిర్ణయాన్ని మార్చుకుంది.  హర్మూజ్‌ జలసంధి మార్గంలో మళ్లీ ఆంక్షలను అమల్లోకి తెచ్చామని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ (ఖతం అల్ అంబియా) శనివారం ప్రకటించింది.

హర్మూజ్, దాని పరిసర ప్రాంతాలను మునుపటిలాగే తమ సైనిక దళాలు పకడ్బందీగా కంట్రోల్ చేస్తాయని తెలిపింది.  తమ ఓడరేవులను ముట్టడించడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ ఆరోపించింది. ఈ ముట్టడిని అమెరికా కొనసాగించినన్ని నాళ్లు, హర్మూజ్ ముట్టడిని తాము కొనసాగిస్తామని తేల్చి చెప్పింది.

కాగా, అమెరికా – ఇరాన్ మధ్య మరోవిడత శాంతిచర్చలు సోమవారం  పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఇరుదేశాల ప్రతినిధులు ఆదివారంకల్లా ఇస్లామాబాద్‌కు చేరుకుంటారని సమాచారం. చర్చలతో సంబంధమున్న పలువురు ఇరాన్ అధికార వర్గాలు ఈవివరాలను చెప్పాయంటూ అమెరికా మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.
 
ఉద్రిక్త‌త‌లు త‌గ్గించే నేప‌థ్యంలో పాకిస్తాన్ ప్ర‌ధాని షెహ‌బాజ్ షరీఫ్ గ‌ల్ఫ్ దేశాల్లో ప‌ర్య‌టించారు. ఖతార్ షేక్ త‌మిమ్ బిన్ హ‌మ్మ‌ద్‌, ట‌ర్కీ అధ్య‌క్షుడు రీసెప్ త‌య్యిప్ ఎర్డ‌గోన్‌ను క‌లిశారు. ఇక పాక్ ఆర్మీ చీఫ్ , ఫీల్డ్ మార్ష‌ల్ అసిమ్ మునీర్ ఇరాన్‌లో ప‌ర్య‌టించారు. ఆ దేశ విదేశాంగ మంత్రి అర‌గాచితో సంప్రదింపులు చేశారు. ఇరానీ పార్ల‌మెంట్ స్పీక‌ర్ భ‌గేర్ ఘాలిబ‌ఫ్‌ను కూడా అసిమ్ మునీర్ క‌లిశారు.
ఇరాన్‌‌తో కుదిరిన రెండువారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాను పొడిగించే అవకాశాలు ఉండకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ గడువు (ఏప్రిల్ 22) ముగిసేలోగా ఇరాన్ తమతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటుందా లేదా అనే దానిపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. ఒకవేళ మళ్లీ తమతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ కుదుర్చుకోకుంటే, ఆ దేశ ఓడరేవుల ముట్టడిని అమెరికా నౌకాదళం కొనసాగిస్తుందని, దురదృష్టవశాత్తు మళ్లీ తాము ఇరాన్‌పై బాంబులు వేయాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.