2029 లోక్‌సభ ఎన్నికల్లోనే కాకుండా, ప్రతి స్థాయిలో, ప్రతి ఎన్నికలో మరియు ప్రతి చోటా ప్రతిపక్షాలు ‘మహిళల ఆగ్రహాన్ని’ ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. 2029 నాటికి శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు.
లోక్‌సభ స్థానాల సంఖ్యను 816కు పెంచేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన వెంటనే స్పందిస్తూ “ఈ రోజు లోక్‌సభలో ఒక అత్యంత విచిత్రమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ‘నారీ శక్తి వందన్ అధినియం’ అమలుకు అత్యంత ఆవశ్యకమైన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే. సమాజ్‌వాదీ పార్టీలు అడ్డుకున్నాయి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లును తిరస్కరించడం, దానిని వేడుకగా జరుపుకోవడం. దానిపై విజయ నినాదాలు చేయడం నిజంగా అత్యంత హేయమైన చర్య, ఇది ఊహకు కూడా అందని విషయం అంటూ మండిపడ్డారు. “ఇప్పుడు, దేశంలోని మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో దక్కాల్సిన 33 శాతం రిజర్వేషన్లు లభించవు. వాస్తవానికి అది వారి హక్కు” అని స్పష్టం చేశారు.
“కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు, వారు పదేపదే ఇలాగే చేస్తున్నారు. వారి ఆలోచనా విధానం మహిళల ప్రయోజనాలకు గానీ, దేశ ప్రయోజనాలకు గానీ ఏమాత్రం అనుకూలంగా లేదు. నారీ శక్తికి జరిగిన ఈ అవమానం ఇక్కడితో ఆగిపోదని, ఇది దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని నేను వారికి తెలియజేస్తున్నాను. 2029 లోక్‌సభ ఎన్నికల్లోనే కాకుండా, ప్రతి స్థాయిలో, ప్రతి ఎన్నికలో మరియు ప్రతి చోటా ప్రతిపక్షాలు ‘మహిళల ఆగ్రహాన్ని’ ఎదుర్కోవాల్సి ఉంటుంది,” అని అమిత్ షా ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్‌లో విమర్శించారు.
అంతకు ముందు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై జరిగిన చర్చకు అమిత్ షా సమాధాననిస్తూ నారీమణులకు మేలు చేసే బిల్లులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు. మహిళా సాధికారత దిశగా చేసే పనులకు ఎందుకు మద్దతివ్వడం లేదని నిలదీసేరు. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలుచేసేలా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
ప్రస్తుత లోక్‌సభ నియోజకవర్గాల జనాభాలో తీవ్ర వ్యత్యాసం ఉందని చెబుతూ ఒక ఎంపీ లక్షల మంది ప్రజల సమస్యలను ఎలా వినగలరని అడిగారు. ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపుదలను కూడా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల ఎవరికీ నష్టం ఉండదని కేంద్ర హోం మంత్రి తేల్చిచెప్పారు. 2026 జనగణనతో పాటే కులగణనను కూడా నిర్వహించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని పేర్కొన్నారు.
“ఒకవేళ మనం 543 సీట్ల ఆధారంగా మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తే తమిళనాడులో మహిళలకు 13 సీట్లు రిజర్వ్ అవుతాయి. మిగిలిన 26 సీట్లు సాధారణ విభాగంలో ఉంటాయి. ఒకవేళ 2011 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తే తమిళనాడులో ఎంపీ స్థానాలు 6 తగ్గుతాయి. కానీ మేము అలా చేయడం లేదు. ప్రతి రాష్ట్రానికి సీట్ల సంఖ్యను 50శాతం మేర పెంచుతున్నాం” అని తెలిపారు.
నియోజకవర్గాల పునర్విభజన విషయంలో విపక్షాలు తమకు మద్దతు ఇస్తే, అన్ని నియోజకవర్గాల్లోని ప్రతి ఓటుకూ సమాన విలువ ఉంటుందని తెలిపారు. ఈ కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లుపై సభలో దాదాపు 133 మంది సభ్యులు మాట్లాడారని, అందులో 56 మంది మహిళా సభ్యులే కావడం విశేషమని చెప్పారు. ఎంపీ తన విధులు సమర్థంగా నిర్వహించేందుకు ఈ డీలిమిటేషన్ తోడ్పడుతుందని చెబుతూ అందుకే ఈ రాజ్యాంగ సవరణకు పూనుకున్నామని వెల్లడించారు.
మల్కాజ్‌గిరిలో నియోజకవర్గంలో దాదాపు 30 లక్షల మంది, డిల్లీ, బెంగళూరు, గాజియాబాద్‌లో 20లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని చెప్పారు. డీలిమిటేషన్ తర్వాత ఆయా చోట్ల రెండు సీట్లు వస్తాయని, దీనివల్ల సభ్యులకు, ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. 1972లో ఇందిరా ప్రభుత్వం లోక్‌సభ సీట్లను 545కు పెంచిందని ఆయన గుర్తు చేశారు. ఇన్నాళ్లపాటు లోక్‌సభ ఎంపీ సీట్లు సంఖ్య పెంచకుండా అడ్డుకున్న ఘనత కాంగ్రెసేదేనని దుయ్యబట్టారు.

More Stories
పాక్ లో వరుసగా భారత్ మోస్ట్-వాంటెడ్ ఉగ్రవాదులు హతం
‘కార్పొరేట్ జిహాద్’ కనిపిస్తే వదిలే ప్రసక్తే లేదు
లోక్ సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు