అందరూ ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని ఎదురుచూసిన హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఈ మేరకు సోషల్ మీడియాలో దీనిపై శుక్రవారం ఒక ప్రకటన చేశారు. ఇకపై హార్ముజ్ జలసంధి అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇటీవలే అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య గురువారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. పది రోజులపాటు కాల్పుల విరమణ కొనసాగనుంది.
ఈ నేపథ్యంలోనే హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నంత కాలం జలసంధి తెరిచి ఉంచే అవకాశం ఉంది. ‘‘లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమలు నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నాం. ఈ ఒప్పందం అమలులో ఉన్నంతకాలం హార్ముజ్‌ను అందరికీ అందుబాటులోకి తెస్తున్నాం. అన్ని రకాల వాణిజ్య నౌకల్ని అనుమతిస్తాం. ఈ అంశంపై ఇప్పటికే అన్ని పోర్టులకు సమాచారం అందించాం. సంబంధిత రూట్ల గురించి కూడా తెలియజేశాం’’ అని అరాగ్చీ తన పోస్టులో పేర్కొన్నారు.
ఇరాన్ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే యుద్ధం ముగింపునకు ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోనంత వరకు ఇరాన్ పోర్టులకు రాకపోకలు సాగించే నౌకల దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్టు ట్రంప్ గురువారమే ప్రకటించారు. అదే సమయంలో ఇరాన్ మద్దతుతో లెబనాన్‌లో ఉన్న హెజ్బొల్లా గ్రూప్‌కు సంబంధించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు.
అయితే గత కొన్ని వారాలుగా ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు వద్ద జరుగుతున్న కాల్పులకు తెరదించడానికి తానీ ఒప్పందం చేయించినట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ ముఖ్య సమయంలో హెజ్బొల్లా సంయమనంతో వ్యవహరిస్తుందన్న ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య చర్చలు జరిపేందుకు, అస్థిరంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్ది దౌత్యపరమైన చర్యల్లో భాగస్వాములను చేసేందుకు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసఫ్ ఆన్‌లను వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు.
ఈ జలమార్గంలో సుమారు 50 రోజులుగా ఏర్పడిన ప్రతిష్టంభనతో ప్రపంచ ఇంధన మార్కెట్లు అల్లాడాయి. నౌకా రవాణా భద్రతపై కూడా తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో ఇంధన, గ్యాస్, ఎరువులు, ఎసిటిలిన్ కొరత ఏర్పడి వాటి దుష్పరిణామాలను చవిచూస్తున్నాయి. కాగా, జలసంధి మార్గాన్ని తెరవడంతో అక్కడ నిలిచిపోయిన నౌకలు ఒక్కొక్కటిగా తమ గమ్య స్థానాలకు బయలుదేరినట్టు సమాచారం.

More Stories
హర్మూజ్‌ను మళ్లీ మూసేసిన ఇరాన్.. 20న అమెరికాతో చర్చలు!
ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నీ విజేతగా వైశాలి
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య10 రోజుల కాల్పుల విరమణ