భారతీయ రెస్టారెంట్‌ లకు నెలకు రూ.79,000 కోట్ల నష్టం

భారతీయ రెస్టారెంట్‌ లకు నెలకు రూ.79,000 కోట్ల నష్టం

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ ఘర్షణలతో అంతర్జాతీయంగా ఇంధన సరఫరా గొలుసు దెబ్బతినడంతో దేశంలో వంట గ్యాస్‌ కొరత తీవ్రమై భారతీయ రెస్టారెంట్‌ రంగం నెలకు ఏకంగా రూ.79,000 కోట్ల భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూస్తోందని పిహెచ్‌డి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ(పిహెచ్‌డిసిసిఐ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ రంగంలో 7 లక్షల ఉద్యోగాలు ఊడిపోవచ్చని అంచనా వేసింది. 

2026 ముగింపు నాటికి ఈ రంగం రూ.6.46 లక్షల కోట్ల నష్టాన్ని చవి చూడొచ్చని తెలిపింది. ప్రస్తుతం రోజుకు రూ.2,650 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతోందని పేర్కొంది. ఎల్‌పిజి సరఫరాలో అంతరాయంతో రెస్టారెంట్‌ పరిశ్రమలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఎఐ) అధ్యక్షుడు సాగర్‌ దర్యాని ఆందోళన వ్యక్తం చేశారు. 

దాదాపు 10 శాతం రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయని, మిగిలిన 60 నుండి 70 శాతం సంస్థలు ఇండక్షన్‌ కుకింగ్‌, ప్రత్యామ్నాయ ఇంధనాలు లేదా పరిమిత మెనూలతో నెట్టుకొస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల వినియోగదారుల రాక 8 నుండి 10 శాతం తగ్గడమే కాకుండా, సగటు కస్టమర్‌ చేసే ఖర్చు కూడా 6 నుండి 8 శాతం పడిపోయిందని ఆయన గణాంకాలతో వివరించారు.

ప్రస్తుతం ఈ రంగంపై ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్న 85 లక్షల మందిలో దాదాపు 5 నుండి 7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. విమాన ప్రయాణాలు రద్దు కావడం, గగనతల ఆంక్షలు, విమానాల దారి మళ్లింపు వంటి సమస్యలను విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్నాయని పిహెచ్‌డిసిఐఐ పేర్కొంది.  దేశ జిడిపిలో 8 శాతం వాటా కలిగి 4 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న పర్యాటక, ఆతిథ్య రంగాలు ఈ సంక్షోభంతో అగాధంలోకి వెళ్తున్నాయి. ముఖ్యంగా విదేశీ పర్యాటకుల రాక 15 నుండి 20 శాతం మేర పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

”ఈ అంతరాయాల వల్ల ప్రధాన మార్గాల్లో ప్రయాణ సమయం 2 నుండి 4 గంటల వరకు పెరిగింది. దీనివల్ల ఇంధన వినియోగం, నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి” అని నివేదిక పేర్కొంది. విమానయాన నిర్వహణ ఖర్చులలో ఇంధనం వాటా 35-40 శాతం వరకు ఉంటుందని పరిశ్రమ అంచనా. ప్రస్తుత పరిస్థితి విమానయాన సంస్థల లాభదాయకతను మరింత దెబ్బతీసింది. 

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మధ్యప్రాచ్యం గగనతల కారిడార్లలో అంతరాయం కలగడం వల్ల కనెక్టివిటీ సామర్థ్యం తగ్గడమే కాకుండా, విమాన ప్రయాణ ధరలు కూడా పెరిగాయి. ఈ రంగం సుమారు రూ.17,000-18,000 కోట్ల మేర నష్టపోవచ్చని పిహెచ్‌డిసిసిఐ అంచనా వేసింది. ఎందుకంటే ఈ పరిశ్రమ ఆదాయంలో 15-20 శాతం పశ్చిమ ఆసియా గగనతలం మీదుగా నడిచే విమానాల నుండే లభిస్తుందని తెలిపింది.