నిత్య జీవితంలో సత్యం, దయ, క్షమ వంటి సద్గుణాలను ఆచరించడం ద్వారా మనిషి జీవితం సార్థకమవుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన ధార్మికోపన్యాస కార్యక్రమంలో “నిత్య జీవితంలో ధర్మాచరణం” అనే అంఅంశంపై ప్రసంగిస్తూ కాలానుగుణంగా ధర్మంలో మార్పులు వచ్చినా సత్యం ఎప్పటికీ నిలకడగా ఉంటుందని తెలిపారు.
సత్యం, అహింస, దయ, క్షమ, సహనం వంటి గుణాలు ధర్మానికి మూలాధారాలని, ఇవే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని చెప్పారు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుని సాన్నిధ్యం తప్పక ఉంటుందని, శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడని వివరించారు.
ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో ధర్మాచరణకు పెద్దపీట వేయాలని, ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను స్మరించడం, పెద్దలను ఆదరించడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం మన బాధ్యత అని చెప్పారు. సనాతన ధర్మంలో తల్లికి అత్యున్నత స్థానం ఉందని, తల్లిని ప్రేమగా చూసుకోవడం, సేవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని వివరించారు.
అలాగే గోసేవ సనాతన ధర్మానికి ప్రాణస్వరూపం అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ గోవులను సంరక్షించి సేవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ధర్మాచరణలో ఓర్పు ముఖ్యమైన గుణమని, ఓర్పును మించిన ధర్మం లేదని చెప్పారు. శ్రీవేంకటేశ్వర స్వామివారు క్షమాగుణంతో భక్తులపై అపార కరుణ చూపుతున్నారని పేర్కొన్నారు.
ధర్మబద్ధమైన జీవన విధానం ద్వారా వ్యక్తిగత శాంతి, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతూ ప్రతి ఒక్కరూ సత్యం, దయ, క్షమ వంటి విలువలను ఆచరిస్తూ జీవించడమే నిజమైన భగవద్భక్తి అని పిలుపునిచ్చారు. సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాల సారాంశాన్ని ప్రజలకు సులభంగా అందిస్తూ విలువలను పెంపొందించాలని చెప్పారు.

More Stories
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై అనవసర దుష్ప్రచారం
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భైరవకోన
ఏపీకి చెందిన టెకీ హర్యానాలో దారుణ హత్య